Jul 04,2023 22:15

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
          మండలంలోని దొరమామిడి సమీపంలోని సరుగుడు నిర్వాసిత కాలనీలో బాలుని అదృశ్యంపై కొంతమంది అనుమానితులను ప్రశ్ని స్తున్నామని, అతి త్వరలో బాలుని ఆచూకీ కనిపెడతామని జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి తెలిపారు. సరుగుడు గ్రామానికి చెందిన కొవ్వాసు వెంకటేష్‌, రామలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు కొవ్వాసు రవితేజ (1) సోమవారం తెల్లవారుజాము నుంచి కన్పించడం లేని సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతి మంగళవారం గ్రామానికి వచ్చారు. సరుగుడు గ్రామంలోని బాలుడి ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి బాలుడు తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని ప్రశ్నించారు. అనంతరం ఎస్‌పి మీడియాతో మాట్లాడుతూ బాలుని అదృశ్యంపై ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే బాలుని ఆచూకీ కనిపెడతామని చెప్పారు. ఆమె వెంట పోలవరం డిఎస్‌పి ఎ.శ్రీనివాస్‌, జీలుగుమిల్లి సిఐ బి.వెంకటేశ్వరరావు, బుట్టాయిగూడెం ఎస్‌ఐ వెంకన్న, తడికలపూడి ఎస్‌ఐ జయబాబు తదితరులు ఉన్నారు.