Sep 08,2023 21:02

పరిస్థితిని వివరిస్తున్న వైద్యులు


అతిసార తగ్గుముఖం
గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణ
ఆర్‌ఒ ట్యాంక్‌, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారులు
ప్రజాశక్తి - పగిడ్యాల
   పగిడ్యాల, బీరవోలు, ఆంజనేయ నగర్‌ గ్రామాలలో అతిసార కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కొత్తగా ఎలాంటి కేసులు రాలేదు. ఆయా గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. క్లోరిన్‌ గుళికలను ఒక బిందె నీటిలో ఒక గుళిక వేసి నీరు తాగాలని సూచిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి 95 మందికి అతిసార సోకగా వారందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయడం అందిస్తున్నారు. దాదాపు 25 మంది కోలుకున్నారు. బీరవోలు, ఆంజనేయ నగర్‌ గ్రామాలలో వాడుకోవడానికి ఒక ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ద్వారా, తాగడానికి ఆర్వో ట్యాంకు ద్వారా, పగిడ్యాల గ్రామంలో వాడుకునేందుకు మూడు ట్రాక్టర్‌ ట్యాంకుల ద్వారా, ఒక ఆర్వో ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామాలలో ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, జిఎల్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులు, రౌండ్‌ ట్యాంకు లను శుభ్రం చేసి క్లోరిన్‌ వేస్తున్నారు. పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌, ఎంపీడీవో వెంకటరమణ వారు విలేకరులతో మాట్లాడారు. అతిసారా ప్రబలిన గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారులు
పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌సి మనోహర్‌, డిపిఓ మంజులవాణిలు శుక్రవారం సందర్శించారు. పరిస్థితులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ వెంకటరమణ మాట్లాడారు. పగిడ్యాల, బీరవోలు, ఆంజనేయ నగర్‌ గ్రామాలలో ప్రస్తుతం కొనసాగుతున్న మెడికల్‌ క్యాంపులను కొనసాగించాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌కు సూచించారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో పూర్తిస్థాయిలో మందులు ఉన్నాయని ఇంకా 500 మందికి సరిపడా మందులను తెప్పిస్తున్నామని ఆయన తెలిపారు. తగు జాగ్రత్తలను వైద్య సిబ్బందికి వారు సూచించారు.