వేకువపిట్ట చీకటి దుప్పటి
మడత పెట్టేయకుండానే
పచ్చిక మెచ్చిన పాదాలు
భూమి తల్లికి ప్రణమిల్లుతాయి
అతని చేతి స్పర్శలో చేనుపిల్ల
కిలకిలమని నవ్వులు రువ్వుతూ పత్తిపువ్వులా విచ్చుకుంటుంది
నెరల నోళ్ళన్నీ అతని
చెమట వాసన
అత్తరులా ఆస్వాదిస్తాయి
కరిమబ్బు వెంటపడిన
తుంటరి గాలోడి మన్మధ బాణాలు
గుండెల్లో పూలచెండు
విసిరినట్టు తగిలాయి
వాన వీణ తీగ రాగం పలికింది
ఆనంద భాష్పాలు జలజలా
ముత్యాల్లా రాలిపడుతున్నాయి
వెదజల్లిన విత్తులు మత్తువదిలి
అంకురాలు భూమిని చీల్చుకుని
యుద్ధంలో శత్రువును హతమార్చిన
ఠీవి దర్జాని ఒలకబోస్తున్నాయి
నకిలీ పురుగుమందులు, ఎరువులు
పాలు పొసుకునే సమయంలో
తాలుగింజలు చేయటానికి
అగ్నికి వాయువు తోడైనట్లు నిలిచాయి
పెళ్ళీడు కొచ్చిన పంట కన్నెమీద
కన్నేసిన దళారుల దొంగచూపులు
చూసినా పట్టించుకోలేదు
అడ్వాన్సు పేరుతో
ముందర కాళ్లకు చక్రబంధం వేశారు
రెక్కల కష్టాన్ని
అతివృష్టి రాబందు ఎత్తుకుపోయింది
శత్రుదేశం దొంగ దెబ్బల తూటాల
వర్షంలో తడిసిన యోధుడిలా
ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించే
రాయితీలు అక్కరకు రాక
అతని దేహం అప్పుల జల్లెడైంది
అతను అలిగిననాడు
యావత్ మానవ జాతే
ఆకలో లక్ష్మణా అంటూ
అల్లాడిపోతుంది
అతనికి జవసత్వాల రాయితీల
భరోసా ఇవ్వాలి
వారసుడు వారసత్వం
అనుసరించే పరిస్థితులు కల్పించాలి
అంపశయ్య మీదున్న
రైతు భీష్ముడికి ఊపిరి అద్దాలి
- గాదిరాజు రంగరాజు
87901 22275