Feb 14,2022 15:08

లక్నో :  మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి యుపిలో 39.07శాతం, ఉత్తరాఖండ్‌లో 35.21శాతం, గోవాలో 44.63శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కొనసాగుతోంది.   ఉత్తరాఖండ్‌లో పోలింగ్‌ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, మిగిలిన రాష్ట్రాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి, ఆయన భార్య గీతలు ఎన్నికల కోడ్‌లను ఉల్లంఘించారు. ఖతిమాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన వీరిద్దరూ కాషాయ కండువాలను ధరించారు. ఆ కండువాలపై బిజెపి కమలం గుర్తు ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓటు వేసిన అనంతరం పుష్కర్‌ ధామి భార్య పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ వార్త వివాదాస్పదమైంది.  ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రకారం.. పోస్టర్లు, జెండాలు, పార్టీ గుర్తులు , ఇతర ప్రచార సంబంధిత వస్తువులు పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రదర్శించకూడదు. మీడియా ప్రశ్నించగా.. ఇది ప్రచారం కాదని, ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటింగ్‌ ఎంత జరిగిందో చూస్తుంటామని పుష్కర్‌ ధామి పేర్కొన్నారు. పుష్కర్‌ ధామి ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని ఉత్తరాఖండ్‌కి చెందిన ఆప్‌ యూనిట్‌ పేర్కొంది.

యుపిలో బిజెపి అభ్యర్థి హరేంద్ర అలియాస్‌ రింకువాహనంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాంబల్‌ జిల్లాలోని అస్మోలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కాలియా దేవీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లకు మద్యం పంచుతున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగిందని, కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం.  ఇద్దరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.