లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు గాను 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు. కరోన నిబంధనలు అమలు చేస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు. మొదటి దశ పోలింగ్ బరిలో.. బిజెపి, కాంగ్రెస్, ఎస్‌పి-ఆర్‌ఎల్‌డి, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి. అలాగే సిఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కి చెందిన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు ఈ దశలో తమ అదఅష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించినట్లు అధికారులు తెలిపారు. ఇవిఎం సమస్య మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 35.03 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా శామ్లి జిల్లాలో 41.6 శాతం పోలింగ్ నమోదయింది.
తొలిదశ పోలింగ్‌లో భాగంగా ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగ్రా రూరల్ బిజెపి అభ్యర్థి బేబీ రాణి మౌర్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ కారణంగా ఆర్‌ఎల్‌డి చీఫ్ జయంత్ చౌదరి తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు మధుర ప్రాంతంలో ఓటు హక్కు ఉంది. భారీ ఎత్తున తరలివచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.










