ప్రజాశక్తి-కంచికచర్ల : డిసెంబర్ 5న విజయవాడలో జరగనున్న ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల పిలుపునిచ్చారు. కంచికచర్ల ఎన్జీవో కార్యాలయంలో యూనియన్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆశా వర్కర్ల కు నిర్దిష్టపని గంటలు లేవని, ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అలాంటివారికి రోజు మూడుసార్లు ఫేస్ మస్థర్ వేయాలని, ప్రభుత్వం ప్రకటన చేయటం సరైన కాదన్నారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లను, సంతకాలు పేరుతో సచివాలయాలు సబ్ సెంటర్లలో కూర్చోబెట్టటం, 104 వెహికల్ వచ్చినప్పుడు, ఆశ వర్కర్లకు సంబంధం లేని పనులు అయిన, బిపి ,షుగర్ టెస్ట్ లు చేయడం, మందులు ఇవ్వడం, సబ్ సెంటర్లు దులపడం, నీళ్ళు పెట్టడం, పిచ్చి మొక్కలు పీకటం, చెత్త శుభ్రం చేయడం, వ్యాక్సిన్ క్యారీలు మోయించటం తో పాటు, ఆన్ లైన్ వర్కు కూడా చేయాలని, అధికారులు ఒత్తిడి చేయడం మానుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయకపోతే అది ఆశ వర్కర్ తప్ప ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఫోన్లు పనిచేయకుండా డ్యూటీ చేసిన ఫోటోలు పెట్టాలని పెట్టకపోతే మీరు పనిచేసినట్టు కాదని మీ జీతాలు ఆపుతామని సొంత ఫోన్ ద్వారా పనిచేయాలని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం అని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న జరిగే జిల్లా మహాసభలో ఆశ వర్కర్లు ఎదుర్కునే సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించి ఆందోళన పోరాటాలను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పి.పుల్లమ్మ, వి.నాగమ్మ, వి.ప్రసన్న, గోవిందమ్మ, రజిని తదితరులు పాల్గొన్నారు.










