సమాజం కోసం, ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని దృఢనిశ్చయం, నిండైన ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తులు... జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని వాటిని అధిగమిస్తారు. తమ జీవితాన్ని ఫలవంతం చేసుకుంటారు. ఇటీవల మతి చెందిన డాక్టర్ విశ్వనాథ్ శాంత... 93 ఏళ్ల నిండు జీవితాన్ని అనుభవించి, తన జీవితాన్ని వైద్యసేవకే అంకింతం చేశారు. అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్‌పర్సన్‌గా, ప్రపంచం మెచ్చిన అంకాలజిస్టుగా ఖ్యాతిగడించారు. 12 ఏళ్ల వయస్సులో, 8వ తరగతి చదువుతున్న సమయంలోనే డాక్టరు కావాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్రంగా ప్రజలకు ఏదైనా చేయాలని చిన్ననాడే... బలంగా నమ్మిన తన సిద్ధాంతం నుంచి, పెట్టుకున్న ఆశయం నుంచి, నిర్ణయించుకున్న లక్ష్యం నుంచి ఎక్కడా ఒడిదుడుకులకు లోనుకాకుండా తన గమ్యం వైపు అడుగులు వేశారు. అలాగే 95 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన కమ్యూనిస్టు ఉద్యమ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఒకరు. 18 ఏళ్ల వయసులోనే తన లక్ష్యాన్ని నిర్ణయించుకొన్న ఆయన... తుది వరకూ అదే ఆశయ పథంలో, అదే సంకల్పంతో పయనించారు. ప్రపంచంలో సోషలిజానికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు... సోషలిజానికి మించిన ప్రత్యామ్నాయం లేదని చాటి చెప్పిన మహానేత ఆయన. జీవితమంతా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి... ఐదు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేసినా మచ్చ లేని సూర్యుడిలా వెలుగొందారు. ఇలా తమ జీవితాన్ని ఆశయ సాధనతో పరిపూర్ణం చేసుకుని నిండైన జీవితం గడిపిన వారు అనేకమంది వున్నారు. ఇటువంటి మహనీయులు సమాజం మీద చెరగని ముద్ర వేస్తారు. చరిత్రలో నిలిచిపోతారు. ఐతే, మన మధ్య కొంతమంది తమ ఆశయాన్ని మధ్యలోనే వదిలేసి, స్వార్థప్రయోజనాల వెంట పరుగులు తీసిన వారూ వున్నారు. తనదికాని జీవితం కోసం బతుకుతూ... ఓడిపోతూ... గమ్యం చేరకుండానే మార్గ మధ్యంలో కాడి వదిలేసి, ఆశయాలకు తిలోదకాలిచ్చి అనామకులుగా మిగిలిపోతుంటారు.
ఈ విధంగా మధ్యలోనే ఆశయాలను వదిలేసి అవకాశవాదులైన వారిని సమర్థిస్తూ... ''యవ్వనంలో నిన్ను కమ్యూనిజం ఆకర్షించకపోతే నీలో ఏదో లోపం వున్నట్టు లెక్క.. నలభై సంవత్సరాల తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్టుగా కొనసాగితే నీలో లేదో ఉన్నట్టు భావించాలి'' అన్నాడు జవహర్‌లాల్ నెహ్రూ. అన్ని సందర్భాలలోనూ నెహ్రూను పడరాని తిట్లు తిట్టే సంఘ పరివారం... నెహ్రూ చెప్పిన ఈ కొటేషన్‌ని మాత్రం విరివిగా వాడుతుంటారు. ''మేమూ ఒకప్పుడు ఉద్యమాలలో తిరిగినవాళ్లమే. కాని బాధ్యతలు తెలిసివచ్చాక అవన్నీ వదిలేసి ఇల్లూ, పిల్లలూ, సంసారం చూసుకుంటున్నాం'' అంటూ వారేదో కాలజ్ఞానం పొందినవారిలా కొంతమంది మనకు సలహాలిస్తుంటారు. ఈ తరహా వాదనల సారాంశం ఒక్కటే... ''సమాజం కోసం పాటుపడితే కుటుంబానికి న్యాయం చేయలేవు. రెండింట్లో ఏదోకదానినే ఎంచుకోవాలి. అందుచేత కుటుంబాన్నే ఎంచుకో...'' వాస్తవానికి ప్రతీ కుటుంబమూ సమాజంలో భాగమే. సమాజం కుళ్లి కునారిల్లుతూంటే పట్టించుకోకుండా నా ఒక్కడి కుటుంబం బాగా వుండేలా చూసుకుంటానని అనుకోగలిగిన వాళ్లు అంబానీలు, అదానీలు వంటి దోపిడీదారులు మాత్రమే. తక్కినవాళ్లు సమాజాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఎంతోకొంత పాటు పడాల్సిందే. ఈ స్పష్టత వుంటే జీవితాంతమూ ఆశయపథాన్ని వీడకుండా నడవగలుగుతారు.
సూర్యుడి వైపు నడిస్తే... నీడలు వాటంతటవే వెనక్కి మళ్లినట్లు, తన ఆశయపథం వైపు పయనిస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. 'ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నా/ ముందు దారి మాది/ ఉన్నచోటు చాలును మీకు/ ఇంకా వెనక్కి పోతామంటారు కూడా/ మీలో కొందరు/ ముందుకు పోతాం మేము/ ప్రపంచం మా వెంట వస్తుంది/ తృప్తిగా చచ్చిపోతారు మీరు/ ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది/ అభిప్రాయాల కోసం/ బాధలు లక్ష్యపెట్టని వాళ్లు/ మాలోకి వస్తారు/ అభిప్రాయాలు మార్చుకొని/ సుఖాలు కామించే వాళ్ళు/ మీలోకి పోతారు' అని శ్రీశ్రీ చెప్పినట్లుగా నమ్మిన లక్ష్యం కోసం ఆశయపథంలో సాగిపోయే వారి జీవితం భావితరాలకు ఆదర్శం. కనుకనే ప్రపంచం వీరి వెంట నడుస్తుంది.










