Nov 20,2021 06:40

లెనిన్‌ నుంచి సుందరయ్య వరకూ కూడా ఆశయాల వ్యాప్తికి పత్రికల స్థాపన ప్రచురణ ఒక ప్రధాన కర్తవ్యంగా నిర్దేశించారు. దశాబ్దాల తరబడి అధికారం చలాయించి అపార సంపదలు కూడగట్టుకున్న పాలక పార్టీలు కూడా పత్రికలు మాత్రం నడపవు. వాటికి ప్రజలను భ్రమలలో పెట్టడంపై వున్న ఆసక్తి చైతన్యపర్చడంపై వుండదు. ఆ పని కమ్యూనిస్టులు మాత్రమే చేస్తారు. పత్రిక ఒక ఆర్గనైజర్‌ అని లెనిన్‌ అన్నారంటే దాన్ని ఆర్గనైజ్‌ చేసేవారి పాత్ర మరెంత కీలకమైంది? సాధారణంగా పత్రికలు అనగానే సంపాదకులు విలేకరులు రచయితలు గుర్తుకు వస్తారు కాని దాన్ని సకాలంలో ముద్రించి సవ్యంగా చేర్చడం, అందుకు ఆర్థిక సాంకేతిక వనరులు సమకూర్చుకోవడం బృహత్తర బాధ్యత. అలాంటి బాధ్యతలను త్రికరణశుద్ధిగా ఆరు దశాబ్దాలపాటు నిర్వహించిన యోధుడు కామ్రేడ్‌ జోగారావు.
ఏలూరులో ఎగిరిన ఎర్రజండా
లంకా జోగారావు పశ్చిమ గోదావరి జిల్లాలో 1921లో కార్మిక కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒక మిల్లు వర్కర్‌. స్వాతంత్య్రోద్యమానికి కేంద్రాలైన గోదావరి జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా బలమైన పునాదులు పడ్డాయి. పుచ్చలపల్లి సుందరయ్య తరచూ అక్కడ పర్యటిస్తూ స్వాతంత్య్ర యోధులను కమ్యూనిజం వైపు ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలోనే యూనియన్లకు అంకురార్పణ చేశారు. ఏలూరులో ఏర్పడిన తొలి యూనియన్‌ ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌. రోజంతా నిలబడి పనిచేసే ప్రెస్‌ కార్మికులపై దోపిడీ తీవ్రంగానే వుండేది. చేసే పనిని బట్టి వారికి డొక్కశుద్ధి అంటే అవగాహన ఎక్కువగా వుండేది. ఈ కోణంలోనూ ప్రెస్‌ వర్కర్స్‌ అవసరాన్ని నాయకులు వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హక్కుల కోసం పోరాడటంతో పాటు ఆశయాలనూ బోధించారు. 1934లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీకి అంకురార్పణ జరిగింది.1935-36 నాటికే ప్రెస్‌లో పనిచేయడం మొదలు పెట్టిన జోగారావు కూడా ఆ విధంగానే ఆకర్షితులైనారు ఏలూరులో గారపాటి సత్యనారాయణ, అన్నే వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులతో పరిచయం ఏర్పడింది. బనిశెట్టి అప్పారావు, కరణం నరసింహారావు, విభూతి రాఘవయ్య తదితరులతో యూనియన్‌ను నిర్మించారు.1936లో మద్రాసులో అఖిల భారత ప్రెస్‌ వర్కర్స్‌ మహాసభ కూడా జరిగింది. ఏలూరులో తొలి దశ లోనే పనిగంటల క్రమబద్దీకరణ, కూలి రేట్ల పెంపు కోసం సమ్మె నడిచింది. ఆ సమ్మెలో భాగంగా ఒక జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. సమ్మె విఫలమై మిమ్మల్ను పనిలోంచి తీసేస్తే ఏంచేస్తారని నాయకులు ఆ సమావేశంలో ప్రశ్నించారట ఏది ఏమైనా నేను ఇకమీదట పార్టీ కోసం పనిచేస్తానే గాని ఆపనిలోకి మళ్లీ వెళ్లబోనని జోగారావు సమాధానమిచ్చారు! దానికే కట్టుబడ్డారు!
స్వతంత్ర భారత్‌, పోలీసు హింస
1942 వరకూ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుంది గనక పార్టీ పుస్తకాలు ప్రచురణలు అన్నీ రహస్యంగానే జరగాలి. 1937లో నవశక్తి కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ అధికార పత్రికగా నడిచినా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే నడిచింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంకాగానే నాటి ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ నవశక్తిపై పడ్డారు. సుందరయ్య ముందుచూపుతో రాత్రికి రాత్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ను మాయం చేశారు. ఇవన్నీ చేయడానికి జోగారావు తదితరుల కృషి ఎంతో అవసరమైంది. సుందరయ్య మనను బుట్టలో వేశాడు అని రాజాజీ అన్నారట. కొంత కాలం విజయవాడ నుంచి దాన్ని రహస్యంగా తెచ్చారు. 1939లో సుందరయ్య చొరవతో స్వతంత్ర భారత్‌ అనే రహస్య సైక్లోస్టయిల్‌ పత్రిక నడిపించారు. ఈ పత్రిక మొదట కృష్ణా జిల్లా కేసరిపల్లిలో తోట నుంచి నడిచేది. తర్వాత ఏలూరులో ఒక ఒక కాంగ్రెస్‌ నాయకుడి భవనం నుంచి కొనసాగింది. జోగారావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, తుమ్మల వెంకట్రామయ్య, పొట్లూరి సీతారామయ్య తదితరులు స్వతంత్ర భారత్‌ను ఎంతో పకడ్బందీగా పంపిణీ చేసేవారు. దాన్ని పట్టుకోవాలని పోలీసులు సిఐడిలు ఎన్ని తంటాలు పడినా ప్రయోజనం లేకపోయిందని సుందరయ్య రాశారు. రోజూ సినిమా వదిలాక సైకిళ్లపై బయిలుదేరేవారు. వ్యాపారస్తుల్లా కనిపిస్తూ పత్రికను అందించేవాళ్లు. అయితే ఒకరోజు పోలీసులు సైకిలుకు లైటు లేదని ఆపితే రహస్య పత్రికలు బయిటపడ్డాయి. డప్పుల సుబ్బారావు అనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పరమ కర్కోటకుడు. స్కాట్లాండ్‌ రిటర్న్‌డ్‌ అని చెప్పుకునేవాడు. డప్పుల సుబ్బారావు జోగారావును, కొండేపూడిని భయపెట్టడం కోసం బళ్లారి జైలులో వేర్వేరు గదుల్లో పెట్టి దారుణంగా హింసించేవాడు .నిన్ను చంపి గోతాంలో వేసి గుడ్లవల్లేరు లాకుల్లో వేస్తానని భయపెట్టేవాడు. కాని జోగారావు మాత్రం ఎంతో ధైర్యంగా తట్టుకున్నారు. దానికి తగినట్టే పక్క ఖైదు లోని కొండేపూడి కూడా ఏవో సైగలతో తన స్థయిర్యం నిలబెట్టడానికి సంకేతాలు పంపేవాడు. తనకు ఏదైనా ఇంటి నుంచి వస్తే జోగారావుకూ పెట్టేవాడు. ఈ ప్రేమాభిమానాలు, సహచరతత్వం ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. చిన్నవాడైన తనను కాపాడుకోవడానికి నాయకులు కొండేపూడికి ప్రత్యేకంగా సూచనలు చేశారని తెలుసుకున్న తర్వాత పార్టీపై విశ్వాసం మరింత పెరిగింది. కవి, రచయిత అయిన కొండేపూడి తర్వాతి కాలంలో రోజులు మారాయి వంటి గొప్ప చిత్రాలకు రచనలు అందించారు. మాస్కో వెళ్లి పనిచేశారు. చివరి వరకూ జోగారావుతో ఎంతో ఆప్యాయంగా మెలిగేవారు. బళ్లారి జైలు నుంచి ఎలాగో విడుదలైనా మళ్లీ వెంటనే పట్టుకుంటారని సమాచారం రావడంతో పోలీసులకు టోపీ వేసి తప్పుకున్నారు. పార్టీ నాయకత్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, మరో పత్రిక కోసం ప్రయత్నాలు చకచకా జరిగాయి.
ప్రజాశక్తి.. సుందరయ్య సాన్నిహిత్యం
1942 జూన్‌లో ప్రజాశక్తి వారపత్రికగా మొదలైంది. 1945 డిసెంబరులో దినపత్రికగా మారి ప్రజాశక్తి నగరమేవెలసింది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో 1948లో ప్రజాశక్తి ప్రెస్‌పై పోలీసులు దాడి చేసి సర్వనాశనం చేశారు. ప్రకాశం ఆర్డినెన్సుతో నాయకులను వెంటాడి అరెస్టు చేశారు. తెలంగాణలో నాలుగు వేల మంది, ఆంధ్ర ప్రాంతంలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు తీశారు. జోగారావు ఆ దశలన్నిటిలో ప్రెస్‌లో పని చేయడమే గాక నాయకులకు సహాయక బాధ్యతలు నిర్వహించారు. రహస్యాలను కాపాడటంలో ఆయన క్రమశిక్షణ, దీక్షా దక్షతలు ప్రశంసార్హమైనవి. ఇవే ఆయనను సుందరయ్యకు మరింత సన్నిహితుణ్ని చేశాయి. రహస్య జీవితంలో బయిట సందడి పెరిగిన తర్వాతనే కదలికలు ఎక్కువ సురక్షితమని సుందరయ్య అనేవారట. తన వ్యక్తిగత అవసరాల కోసం ఎవరిపైనా భారమేయడానికి ఇష్టపడని సుందరయ్యను కనిపెట్టుకుని వుంటూ నియమబద్ధమైన ఆయన పద్ధతులకు అనుగుణంగా అన్నీ అమర్చిపెట్టడంలో జోగారావు గొప్ప సేవలందించారు. ఎందుకంటే జోగారావు స్వయంగా చాలా పద్ధతిగా మెలిగేవారు. ఉదయాన్నే అందరికన్నా ముందే తన సీట్లో ప్రత్యక్షమై పోయేవారు. ఆయన భార్య విజయ లక్ష్మి కష్టనష్టాలకోర్చి పార్టీ సేవలో ఆయనకు తోడుగా నిలిచారు. 1945లో వాళ్ల పెళ్లి కూడా స్వయంగా సుందరయ్య జరిపించారు. 1951లో పున:ప్రారంభమైన ప్రజాశక్తి 1952లో విశాలాంధ్రగా మారింది. కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలలో సిపిఎం తరపున డి.వి.సుబ్బారావు చొరవతో జనశక్తిని స్థాపించారు. ఆ వెంటనే ప్రభుత్వం నాయకత్వమంతటినీ జైళ్లపాలు చేసింది. తీవ్ర అనారోగ్యంతో డివిఎస్‌ కన్నుమూశారు. బయిట వున్న నండూరి ప్రసాదరావు, బొమ్మారెడ్డి వంటివారు జనశక్తిని నడిపించగా జోగారావు ముద్రణలో ముందు నిలిచారు. జనశక్తి నగ్జలైట్‌ గ్రూపుల చేతుల్లోకి వెళ్లాక మళ్లీ ప్రజాశక్తి వారపత్రికగా పున:ప్రారంభమైంది. జోగారావు ప్రజాశక్తి ప్రెస్‌ మేనేజర్‌గా వుంటూనే ఎ.పి ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. చాలా రోజులు ప్రూఫ్‌లు కూడా చూస్తుండేవారు. రాజకీయ భాషాపరమైన తప్పులు పట్టేసేవారు. ఎమర్జన్సీ కాలంలోనూ ఎన్నో నిర్బంధాల మధ్య నిర్విఘ్నంగా పనిచేశారు. మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, ఎల్‌.బి. గంగాధరరావు తదితర నాయకులందరికీ దగ్గరగా మెలిగారు.
చివరి వరకూ సేవ
1981లో ప్రజాశక్తి మళ్లీ దినపత్రికగా పున:ప్రారంభం కావడంతో జోగారావు మరోసారి అచ్చు బాధ్యతలు తీసుకున్నారు. 1983లో ఆఫ్‌సెట్‌ లోకి మారినపుడు అంత వయసు లోనూ కోల్‌కతా వెళ్లి గణశక్తిలో శిక్షణ పొంది రావడం ఆయన పట్టుదలకు ఒక నిదర్శనం. సాంకేతికంగా వచ్చిన అనేక పరిణామాలను అర్ధం చేసుకోవడానికి ఆయన శ్రమిస్తూనే వచ్చారు. యంత్రాన్ని కనిపెట్టుకుని వుంటూ జాగ్రత్తగా ముద్రణ పూర్తిచేసేవారు. తనదైన నిక్కరు, చొక్కాలో జోగారావు గడియారం లాగా సమయపాలన చేసేవారు. తన అభిప్రాయాల విషయంలో పట్టుదలగా వుండే ఆయన ముక్కు సూటిదనాన్ని నాయకత్వం కూడా గౌరవిస్తూ వచ్చింది.
జోగారావు కుమారుడు హనిమాన్‌. కుమార్తె వినత, అల్లుడు, కొండపల్లి పావన్‌ పార్టీలో కార్యకర్తలుగా అందరికీ సుపరిచితులు. వయో భారం కారణంగా 1993లో అనివార్యంగానే బాధ్యతలు విరమించుకున్నాక పాల్వంచలో వారి దగ్గరే వుంటూ 2004 ఆగష్టు 10న జోగారావు కన్నుమూశారు. మరో రెండేళ్ల తర్వాత భార్య విజయ లక్ష్మి మరణించారు. మొత్తం కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమ మార్గంలో నడిపించడంలో జోగారావు పాత్ర ఎనలేనిది.
ప్రజాశక్తి దినపత్రిక నలభై ఏళ్లు పూర్తిచేసుకుని అనేక ఎడిషన్లతో పురోగమిస్తున్నదంటే చివరి వరకూ దానికోసం అంకిత భావంతో సేవచేసిన జోగారావు వంటి వారు వేసిన పునాదులు ఒక బలమైన కారణం. ఈ శత జయంతి సందర్భంలో ఆయనకివే జోహార్లు. ఇన్ని దశాబ్దాల్లో వామపక్ష పత్రికల ప్రచురణల వ్యాప్తికి దోహదం చేసిన, చేస్తున్న వివిధ విభాగాల సిబ్బందికి జేజేలు. ప్రత్యేకించి ఇంతటి కరోనా సవాళ్ల లోనూ ప్రజాశక్తి నిరాఘాటంగా కొనసాగడమే వారి కృషికి ఒక నిదర్శనం. నీరాజనం.
                              తెలకపల్లి రవి - ( 21న విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో కామ్రేడ్‌ లంకా జోగారావు శత జయంతి సభ )