ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందనలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనాలు పెట్టలేదని, దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.మంచి నీరు సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రస్తుతం 30 పడకల నుండి 50 పడకలకు ఆసుపత్రి స్థాయిని పెంచారని, దీంతో కారణంగా పాత బోరువెల్ నుండి వస్తున్న నీరు ప్రస్తుతానికి సరిపోవడం లేదని ,దీనివలన బాత్ రూమ్ లు వాడకానికి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోగులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా నీరు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎం.మహేష్ బాబు,బి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.










