Jul 29,2023 23:44

డోలీలో తరలిస్తున్న కుటుంబీకులు

ప్రజాశక్తి-పాడేరు:మండలంలో అనేక మారుమూల గ్రామాలకు రహదారుల సౌకర్యం లేక గిరిజనుల వేదన అరణ్య రోదనగా మారుతోంది. మండలంలోని దేవాపురం సలుగు పంచాయతీల్లోని మారుమూల గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేని దుస్థితి ఉంది. దీంతో, ప్రమాదాలు జరిగినప్పుడు వీరికి తక్షణ వైద్య సేవలు అందని పరిస్థితి ఉంది. సలుగు పంచాయతీలోని దబ్బగరువు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలిక జర్త శాంతి కుమారి మేకలు కాయడానికి శుక్రవారం మధ్యాహ్నం అడవికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడడంతో ఎడమ కాలికి తీవ్రంగా గాయపడింది. కదలి లేని స్థితిలో గాయ పడి ఉన్న ఈ బాలికను కొంతసేపటికి చుట్టుపక్కల వారు గుర్తించి ఆ రాత్రికి గ్రామానికి చేర్చారు. మరుసటి రోజు ఉదయం ఆ బాలికను కుటుంబ సభ్యులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డోలిమోతతో తరలించి వైద్య సేవలు కల్పించారు.తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్య సేవలు అందించడానికి ఒక రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైందని గిరిజనులు తెలిపారు.