
ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని చౌడువాడ మేజర్ పంచాయితీలో గల పశువుల ఆసుపత్రికి పూర్తి కాల పశువైద్యాధికారిని నియమించాలని చౌడువాడ, ఆ ఆసుపత్రి పరిధిలోని గ్రామాల రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు కోరుతున్నారు. ఈ ఆసుపత్రి పరిధిలో చౌడువాడ గ్రామంతో పాటు ఆ పంచాయతీ పరిధిలోని మల్లంపాలెం, గరుగుబిల్లి, పాచిలవానిపాలెం గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 80 శాతం మంది రైతులు పశుపోషణపై ఆధారపడి జీవన సాగిస్తున్నారు. అధికంగా పాడిపశువులను పెంచుకుంటూ పాలును విశాఖ డెయిరీ, హెరిటేజ్ డెయిరీలకు పోస్తున్నారు. మండలంలోని ఏ గ్రామంలో లేనన్ని పాల సేకరణ కేంద్రాలు చౌడువాడలో ఉన్నాయి. మేలు జాతి ఆవులు, గేదెలను వీరు పెంచుతున్నారు. అలాగే గొర్రెలు మేకల పెంపకందారులు కూడా ఎక్కువమంది ఉన్నారు.
పశువులు, గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురైతే చౌడువాడ పశువుల ఆసుప్రతిలో వైద్యం చేయడానికి పూర్తిస్థాయి డాక్టరు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆసుపత్రికి ఇన్‌ఛార్జి డాక్టర్‌గా మండలంలోని కొరువాడ పశు వైద్యాధికారిని నియమించారు. ఆయన ఎప్పుడో పది రోజులకు 15 రోజులకు వస్తూ ఉంటారు. ఆస్పత్రిలో అసిస్టెంట్ డాక్టర్ ఒకరు ఉన్నా ఆయనకు పశువులకు, గొర్రెలకు, మేకలకు వైద్యం చేయడం రాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఆస్పత్రికి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఆయనకే తెలీదు. దీంతో గ్రామంలో పశువుల ఆసుపత్రి ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉంది.
పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు ప్రైవేటు పశు వైద్యాధికారులను సంప్రదించాల్సి వస్తోంది. దీంతో వారు పశు వైద్యం పేరుతో వేల రూపాయలు రైతుల వద్ద నుండి గుంజుతున్నారు. పశువులకు చూడు ఇంజక్షన్, చూడు తనిఖీ మొదలైన వాటికి అధిక రేటు వసూలు చేస్తున్నారు. రైతులు చేసేదిలేక వారు అడిగినంత డబ్బులు ప్రైవేటు పశు వైద్యులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎక్కువ పశువులు ఉండి, ఎక్కువగా పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతులు ఉన్న గ్రామంలో పర్మినెంట్ పశువైద్యాధికారి లేకపోవడంతో తమ పశువులను వ్యాధుల నుండి రక్షించుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ గ్రామం పట్ల, తమ పట్ల చిన్న చూపు చూస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ పంచాయతీ పరిధిలో రెండు సచివాలయాలు ఉన్నాయి. గ్రామంలో పశువుల ఆసుపత్రి ఉండడం వల్ల సచివాలయ పశు వైద్య సహాయకులను నియమించలేదు. కనీసం వారు ఉన్నా వారితో పశువులకు వైద్యం చేయించుకునేవాళ్లమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతితులు స్పందించి చౌడువాడ పశువుల ఆసుపత్రికి పూర్తి కాల పశు వైద్య అధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.