Mar 24,2023 23:57

నిరసన చేపడుతున్న కార్మికులు, సిఐటియు నేతలు


ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఐటిడిఏ ముందు శుక్రవారం నిరసన చేపట్టి ప్రాజెక్ట్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్‌ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ఆసుపత్రుల్లో గత 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.16 వేల వేతనం చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు రూ. 10,700, సెక్యూరిటీ గార్డులకు రూ.8366 మాత్రమే కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారని చెప్పారు. పిఎఫ్‌, ఈఎస్‌ఐ కార్మికుల నుండి వసూలు చేస్తున్నప్పటికీ యజమాన్యం పిఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించడం లేదన్నారు. తక్షణమే కాంట్రాక్ట్‌ విధానం రద్దుచేసి వైద్య విధాన పరిషత్‌ ద్వారా జీతభత్యాలు చెల్లించాలన్నారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో 200 పడకలకుగాను వంద పడకల సిబ్బందితోనే పని చేయిస్తున్నారని, అరుకు ఏరియా ఆసుపత్రిలో 150 పడకలకు గాను 100 పడకల సిబ్బందితోనే పని చేస్తున్నారని దీంతో, పని భారం ఎక్కువై తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించి, పరికరాలు, యూనిఫామ్‌ సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎల్‌ సుందర్రావు, ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘు, ముత్యాలమ్మ, కప, సుమిత్ర, పుణ్యవతి, శివ, రాజేశ్వరి, కొండమ్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.