
ప్రజాశక్తి-గొలుగొండ:మాజీ మంత్రి అయ్యన్న అసత్య ప్రచారాల మానుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ హితవు పలికారు. ఆదివారం గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నిధులు తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం వరకు రోడ్డు విస్తరణ పనులకు అయ్యన్నపాత్రుడు హయాంలో కేవలం జిఒ మాత్రమే తెచ్చారని, నిధులు విడుదల కాలేదన్న విషయాన్ని అయ్యన్న గుర్తించుకోవాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఆయనే నిధులు తెచ్చానని, అప్పట్లో ఆ మూడున్నర కిలో మీటర్లకు అటవీ అనుమతులు తెచ్చేలోగా ఎన్నికలు వచ్చేశాయంటూ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రోడ్డుకు రెండు దఫాలుగా రూ.19కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిధులు మంజూరైతే అయ్యన్న ప్రభుత్వంలో నిధులు మంజూరైనట్లు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిహెచ్.భాస్కరనాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, చోద్యం పిఎసిఎస్ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఏఎంసి చైర్మన్ కొల్లు సత్యనారాయణతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.