ప్రజాశక్తి- ఆనందపురం : వేములవలస- వెల్లంకి సర్వీసు రోడ్డు పనులు అస్తవ్యవస్తంగా ఉండడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ ముందు చూపు లేని కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పలువురు వాపోతున్నారు. మూడు రోజులుగా సర్వీసు రోడ్డును ఆనుకొని అటు, ఇటు మూడు అడుగుల వెడల్పు గోతులు తీశారు. వీటిలో బేబీ చిప్స్ నింపి దానిపైన కాంక్రీట్ పనులు చేస్తున్నారు. రోడ్డుకు రెండువైపులా ఒకేసారి గోతులు తీయడంతో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. నిత్యం రద్దీగా ఉండే వేమలవలస కూడలిలో ప్రతిరోజూ వ్యాపారస్తులు, ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు. వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్‌కు ముందు చూపు లేకపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని పలువురు వాపోతున్నారు. ముందుగా ఒక పక్క రోడ్డు పనులు పూర్తి చేసిన తర్వాత రెండో పక్క పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్య ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు, వాహనదారులు కోరుతున్నారు.










