May 04,2023 00:08

తుళ్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి - తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుల అస్త్వస్థకు గురౌవుతున్నారని, తక్షణమే వారికి రక్షణ పరికరాలు ఇవ్వాలని రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి డిమాండ్‌ చేశారు. బుధవారం తుళ్లూరులో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ చెత్తడంప్‌ ో ప్లాస్టిక్‌,మద్యం డబ్బాల కోసం సిఆర్‌డిఎ అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. బుధవారం తుళ్లూరు చెత్తడంప్‌లో ప్లాస్టిక్‌ వస్తువులు వేరు చేస్తూ నీరుకొండ నుంచి తుళ్లూరు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికురాలు నల్లగొండ కోటేశ్వరి,ఎస్‌ రమాదేవి, తుళ్లూరుకు చెందిన వీర్లంకమ్మ దుర్వాసన కారణంగా వాంతులతో సొమ్మసిల్లి పడిపోయారని తోటి కార్మికులు వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చడం జరిగిందని చెప్పారు. మంగళ,బుధ వారాల్లో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ముక్కుపుటా లదిరేలా దుర్వాసన వస్తున్నా,కనీసం రక్షణ పరికరాలు కూడా లేకుండా గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళల్లోని వ్యర్ధాలు,చచ్చిన జంతు కళేబరాలను సైతం బళ్లలో తీసుకెళ్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కార్మికులు రోగాలు తెచ్చుకుంటున్నారని అన్నారు. అధికారులు మాస్కులు కూడా ఇవ్వకుండా చేస్తే చెయ్యండి..లేదంటే పని మానేయండి..అన్న విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.గ్రామాల్లో పారిశుధ్యంకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కార్మికులను డంప్‌లకు తరలించి చెత్తలో వస్తున్న ప్లాస్టిక్‌ వస్తువులను నిల్వచేసి అమ్మి సొమ్ము చేసు కుంటున్నారని అన్నారు. తమ గ్రామాల్లోని కార్మికులను ఇతర గ్రామాలకు పంపిస్తుండటంతో గ్రామాల్లో కార్మికులు తగ్గి, పారిశుధ్యం అధ్వాన్నంగా మారుతున్నా గ్రామాల్లోని పెద్దలు స్పందించక పోవడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు మొండివైఖరి వీడాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాట మాడటం మానుకోవాలన్నారు.ఏ గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆ గ్రామాల్లోనే ఉంచి పనిచేయించాలని డిమాండ్‌ చేశారు.కార్మికులకు ఇవ్వాల్సిన రెండు నెలల పెండింగ్‌ జీతం వెంటనే చెల్లించాలని కోరారు.