ఒక భ్రమణాన్ని
ఒక జీవనయానం గుర్తిస్తుంది
జీవన చక్రంలో
ఆవేశపడ్డ బలం గర్జిస్తోంది.
చతికిలపడ్డ ప్రాణుల ఘోష వినబడుతోంది.
అధికారపు దాహపు ధ్వనుల్లో
ఆక్రమణలు పరాక్రమాలుగా దుముకుతున్నాయి.
వక్రీకరించిన మతసిద్ధాంతాల్లో ఊగినపుడు
గుణంలేని కులం నరాలు చీలుస్తున్నపుడు
సోమరితనం ముసుగులు తొడిగినపుడు
స్వార్ధపు దాడులు తెగబడుతుంటాయి
అశాంతి చిత్రంలో
చెక్కబడ్డ అసంతృప్తి తీరాలు
బతుకుల్ని చిధ్రం చేస్తున్నాయి.
కన్నులు తొలిచే
ఉగ్రవాదంలో జీవికలు మునుగుతున్నాయి
వ్యూహా ప్రతి వ్యూహాల్లో
చెల్లా చెదురైన ఆర్తనాదాలుగా
బతుకులు కూలిపోతున్నాయి
వాలిన చరిత్ర సాక్షిగా
క్రమశిక్షణ పాఠం రుచి చూడని
మానవాళి విధ్వంస దృశ్యాల్ని
తట్టి లేపుతుంది
ఐక్యత లేని రాజ్యం
అస్తిత్వపు ఘోషలు
విలపిస్తుంటాయి
గవిడి శ్రీనివాస్
70192 78368