ఆస్తి తీసుకుని.. అన్నం పెట్టడం లేదు..
- జిల్లా ఎస్‌పికి వృద్ధుడి మొర
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
'నా కొడుకు నా ఆస్తిని మొత్తం తీసుకుని అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటి వేశాడు.. నాకు న్యాయం చేయండి' అంటూ సంజామల మండలం పేరుసోమల గ్రామానికి చెందిన ఎస్.శేఖర్ జిల్లా ఎస్‌పి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదిదారుల నుంచి 60 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. సంబంధిత అధికారులతో జిల్లా ఎస్‌పి స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కువగా సివిల్, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులపై మొదలగు ఫిర్యాదులు అందాయని తెలిపారు. స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం ధేవస్థానం వారు భోజన వసతి ఏర్పాటు చేశారు.
ఫిర్యాదులలో కొన్ని :
- 'నేను 5 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేశాను. నా పంట పక్కన జియో టవర్ ఉంది. జియో టవర్ నుంచి తీగల వలన నిప్పులు రాలి జియో టవర్ కింద ఉన్న గడ్డి అంటుకుని పక్కనే ఉన్న నా జొన్న పంట సుమారు నాలుగు ఎకరాలు కాలిపోయింది. నాకు న్యాయం చేయండి' అంటూ తమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన గోరుకంటి మహేంద్ర ఫిర్యాదు చేశాడు.
- 'ఉద్యోగం ఇప్పిస్తానని కరుణాకర్, రంగమ్మ, సోమశేఖర్‌లు రూ.15 లక్షలు డబ్బులు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. నాకు న్యాయం చేయండి' అని పివి ఉదరు కుమార్, టి.రఘురాముడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో దిశా డిఎస్‌పి మారుతి రావ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ దస్తగిరిబాబు, దిశా ఎస్‌ఐ కల్పన తదితరులు పాల్గొన్నారు.










