ప్రజాశక్తి-అమలాపురం
ప్రజా ఉద్యమ నేత, కెవిపిఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి, పచ్చిమాల వసంత కుమార్ (52) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కొద్దిపాటి అనారోగ్యంతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన వసంత కుమార్ ఆరోగ్యం ఒకసారిగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోనే మృతి చెందారు. వసంత కుమార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన వన్నె చింతలపూడి అంబేద్కర్ నగర్‌కు తరలించారు. శుక్రవారం సాయంత్రం వసంత కుమార్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, సిపిఎం అభిమానుల మధ్య నిర్వహించారు. వసంత్ కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వసంత కుమార్ విద్యార్థి దశ నుంచీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకునిగా చురుకైన పాత్ర పోషించారు. ప్రజాశక్తి దినపత్రిక విలేకరిగా కొంతకాలం పని చేశారు. ప్రజా సంఘాల నాయకునిగా ఎన్నో ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు తదితర ప్రజా సంఘాల్లో పని చేసిన వసంత కుమార్ ప్రస్తుతం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను సిపిఎం, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పలు పార్టీల నాయకులు పరామర్శించారు.
సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ నివాళి
ప్రజాశక్తి - కాకినాడ
సిపిఎం కోనసీమ జిల్లా కమిటీ సభ్యులు పి.వసంత కుమార్ ఆకస్మిక మృతికి సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వసంతకుమార్ పార్టీ, ప్రజా ఉద్యమాల్లో 3 దశాబ్దాలుపైగా పనిచేసి ప్రజలు మన్ననలు పొందారని నివాళులర్పించారు. సిపిఎం నాయకునిగా, కెవిపిఎస్ నాయకునిగా, సిఐటియు నాయకునిగా పని చేసారని తెలిపారు.
వసంత్ మరణం బాధాకరంః
కెవిపిఎస్ నేత వసంత్ కుమార్ మరణం చాలా బాధాకరం. విద్యార్థి దశ నుండి ప్రజా ఉద్యమాల లో పని చేసి గుండె పోటు తో మరణించిన వసంత్ కుమార్ కి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం.
- తొట్టిపూడి రాజా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు.










