Feb 26,2023 20:16

నకిలీ రశీదు

ఆశ్రమం పేరుతో అక్రమ వసూళ్లు ?

ప్రజాశక్తి - పాములపాడు

సాధారణంగా ఎవరైనా దేవుళ్ళ పేరు, ఆశ్రమాల పేర్లు అబద్ధం చెప్పి వసూళ్లకు రారని ప్రజలు నమ్ముతూ.. ఇలాంటి కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడరని నమ్ముతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను, భక్తులను పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మోసం చేసి క్రమ చందాలు వసూలు చేసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానకచర్ల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నంద్యాల, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో ఇతర జిల్లాలలో కార్లలో వెళుతూ ఆధ్యాత్మికంగా దుస్తులను ధరించి వారి పేర్లను రెడ్డి, శెట్టిగా మార్చుకొని బానకచర్ల గ్రామంలో శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా గోశాల అభివృద్ధి చేస్తున్నట్లు పాంప్లెట్లను ముద్రించి గోశాలకు కమిటీ ఉన్నట్లు కమిటీ పేరు మీద రసీదు పత్రాలపై అకౌంట్‌ నెంబర్లు ముద్రించి ఫోన్‌పే నంబర్‌ ముద్రించి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్న ట్లు చందా ఇచ్చిన వారి ద్వారా బహిర్గతమైంది. నంద్యాలకు చెందిన రాజగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి చందా ఇచ్చి అనుమానంతో బానకచర్ల గ్రామంలో ఉన్న బంధువులకు ఫోన్‌ చేయడంతో గ్రామంలో ఎలాంటి ఆశ్రమం గోశాల లేదని వెల్లడించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటు బానకచర్ల గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. గ్రామం పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడడం గ్రామానికి చెడ్డ పేరు అని ఇలాంటి వారిపై పోలీస్‌ అధికారులు కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారి వలన వాస్తవంగా దేవాలయాల నిర్మించే వారికి, ఆశ్రమాలను నిర్వహించే నిర్వహకులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.