ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న ఆహారం తాజాగా అందించేందుకు తాజా కూరగాయలు సరఫరా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ గిరిజన సంక్షేమశాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కూరగాయలు, చికెన్, పాలు, గుడ్లు, అరటిపండ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ, కూరగాయలు, పాలు, గుడ్లు, చికెన్, అరటి పండ్లు సరఫరా చేయడానికి మూడు నెలలకు ఒక సారి టెండర్లు పిలవడం జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు టెండర్లు ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. ఏడు మండలాలలోని అన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో ఆదివారం, మంగళవారం వారానికి రెండు రోజులు తాజా కోడి మాంసం నేరుగా సంబంధిత హాస్టల్లో చేరవేసే బాధ్యత టెండర్‌దారులపై ఉందని పేర్కొన్నారు. అరటిపండు 100 గ్రాములు, కోడిగుడ్డు 50 గ్రాములు తప్పనిసరిగా సరఫరా చేయాలన్నారు. తాజాగా ఉండే కోడిగుడ్లు నెలకు మూడుసార్లు ప్రతి హాస్టల్‌కు చేరవేసే బాధ్యత సంబంధిత టెండర్లదారులపై ఉందని చెప్పారు. కాయగూరలు ఎప్పటికప్పుడు ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేయాలన్నారు. రికార్డులు పక్కాగా నిర్వహించాలని వార్డెన్లకు ఆదేశించారు, సరుకులు సరఫరా చేసే వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని వార్డెన్లను కోరారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి వైద్య పరిక్షలు చేయించి మందులు ఇప్పించాలని వార్డెలను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఆశ్రమ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఆశ్రమ పాఠశాలల అధికారుల అనుమతులు లేకుండా ఇతరులను లోపలికి అనుమతించరాదని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ సిహెచ్ శ్రీనివాసరావు, ఏటిడబ్ల్యూఓలు, రామ తులసి, హాసిని, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ బి.కిషోర్, డిప్యూటీ వార్డెన్లు, టెండరుదారులు పాల్గొన్నారు.










