ఎటిడబ్ల్యుఒ దృష్టికి పలు సమస్యలు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
దేవీపట్నం మండలం మూసినిగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో ఇటీవల గిరిజన బాలిక మృతి చెందిన నేపథ్యంలో పిఎంసి చైర్మన్ కోసు భవాని అధ్యక్షతన మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. ఎటిడబ్ల్యుఒ సిహెచ్.రామ తులసి, దేవారం సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పల సమస్యలను ఎటిడబ్ల్యుఒ దృష్టికి తీసుకొచ్చారు. ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎఎన్‌ఎం పోస్టును యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని, నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని, హాస్టల్ చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచాలని, హాస్టల్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఆదివారం, రెండో శనివారం తల్లిదండ్రులు కలిసే విధంగా అవకాశం కల్పించాలని, మెనూ ప్రకారం సక్రమంగా ఆహారం అందించాలని, పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు తెలియజేయాలని, ఆ సమయంలో స్వగ్రామానికి పంపించాలని తదితర డిమాండ్లతో ఎటిడబ్ల్యుఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, వార్డెన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










