Oct 22,2023 21:33

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని నియమించి విద్యార్థు లకు స్థానికంగా మెరుగైన వైద్యం అందించాలని టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు స్థానికంగా వైద్యసేవలు కరువవుతున్నాయని తెలిపారు. వైద్యం కోసం మండల కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇటు చదువుకు దూరమై అటు ఆరోగ్యం క్షీణించి విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నియమించిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని వైసిపి ప్రభుత్వం తొలగించడంతో విద్యార్థులకు సేవలు అందని ద్రాక్షగా మారిందన్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మినరల్‌ వాటర్‌ అందుబాటులో ఉంచాలని, ప్రహరీలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.
ఒపిఎస్‌ అమలు చేయాల్సిందేలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోరుతున్న పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కృష్ణబాబు కోరారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు ఏం హామీ ఇచ్చారు, ఏం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేనా మాట తప్పను, మడమ తిప్పను అంటే అని విమర్శించారు. ఒపిఎస్‌ అమలు చేయకుంటే మడమ తిప్పినట్టేనన్నారు. యుటిఎఫ్‌ చేపడుతున్న పోరాటాలకు టిడిపి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు.