
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కనుగుణంగా మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో, విద్యార్థిని, విద్యార్థులు జలుబు, తలనొప్పి, దగ్గు జ్వరం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులకు గురైన విద్యార్థులకు వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉపాధ్యాయుల సహాయంతో దగ్గరలోనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కెళ్ళి వైద్య సేవలు పొందుతున్నారు.
మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు జలుబు, తలనొప్పి, జ్వరం వంటి వ్యాధులకు గురయ్యారు. దీంతో, ఆ పాఠశాల మెట్రిన్ విద్యార్థులకు వైద్య సేవలు అందించడానికి సోమవారం ఉదయం స్థానిక డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి స్థానిక వైద్యాధికారి రాంబాబు వైద్య సేవలు అందించారు. ఈ ఒక్క పాఠశాలలోనే కాకుండా మండల వ్యాప్తంగా ఉన్న బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కూడా విద్యార్థులు జలుబు, దగ్గు, తలనొప్పి జ్వరాలు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. గతంలో అశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వ్యాధులకు గురైన విద్యార్థులకు పాఠశాలల్లోనే వైద్య సేవలను వారు అందించేవారు. ప్రస్తుతం హెల్త్ వాలంటీర్లు లేక ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సకాలంలో వైద్య సేవలు అందరిని పరిస్థితి నెల కొంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఎటువంటి వ్యాధులు సోకిన ఉపాధ్యాయులే హాస్పిటల్ కు తరలించే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వ స్పందించి గతంలో మాదిరిగా గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహల్లో హెల్త్ వాలంటీర్లను నియమించి గిరిజన విద్యార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.