ప్రజాశక్తి-పాడేరు:పాడేరు ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఐటిడిఏ వద్ద ఆందోళన నిర్వహించారు. గిరిజన సంఘం కార్యాలయం నుంచి హెల్త్ వాలంటీర్లు ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి తరలి వెళ్లారు. అక్కడ గంటన్నర సేపు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వలంటీర్లు గతంలో 13 సంవత్సరాల పాటు 250 మంది పని చేశారని, ఎటువంటి కారణం లేకుండా వీరిని మూడు సంవత్సరాల కిందట తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం హెల్త్ వాలంటీర్లను వీధుóల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో హెల్త్ వాలంటీర్లు విధుల్లో ఉన్నప్పుడు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా దగ్గరుండి చూసుకునే వారని, వీరిని తొలగించిన తర్వాత ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలు పెరుగుతున్నాయని, అదే విధంగా వివిధ రకాలైన వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో తొలగించిన హెల్త్ వాలంటర్లను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా పట్టించుకోలేదని విమర్శించారు. ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కోసం హెల్త్ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి పడ్డ నాలుగు నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కూడా రాధాకృష్ణ, హెల్త్ వాలంటీర్ల సంఘం నాయకులు రాజబాబు, లక్ష్మణ్, వెంకట్రావు, శాంతి, చంద్రకళ, విజయనగరం జిల్లా నేత హైమ, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు.










