
ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం, సప్పర్ల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాఠశాల చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో క్రూర మృగాలు తరచూ పాఠశాల ఆవరణలోకి రాత్రి సమయంలో ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో గొర్ర గేదెలు, ఎలుగుబంట్లు తదితర జంతువులు రాత్రివేళ విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అవి ఏ క్షణంలో విద్యార్థులపై దాడి చేస్తాయని భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులు హాస్టల్ వసతి భవనాల్లో రాత్రి సమయాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పాఠశాలకు రక్షణ గొడ నిర్మించాలని అనేకసార్లు విద్యార్థులు, తల్లిదండ్రులు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఎనర్జీస్ నిధులతో అరకొర గోడను పాఠశాల ముందు రోడ్డు వైపు నిర్మించి ప్లాస్టింగులు కూడా చేయకుండా విడిచిపెట్టారు. అధికారులు తక్షణమే స్పందించి సప్పర్ల ఆశ్రమ పాఠశాలకు క్రూర మృగాలు నుంచి ఎటువంటి ప్రాణహాని విద్యార్థులు కలగకుండా రక్షణ గోడ నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.