Jul 19,2023 21:19

ప్రజాశక్తి - పోలవరం
     మండలంలోని బోడిగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులపై రేకుల షెడ్డు సీలింగ్‌ పెచ్చులూడి పడటంతో ఇద్దరు విద్యార్థినులు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో రేకులతో నిర్మించిన షెడ్డులో విద్యార్థులు నిద్రించారు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేకుల షెడ్డుకి వేసిన పిఒపి సీలింగ్‌ నాణ్యతా లోపం కారణంగా ఒక్కసారిగా విరిగి నిద్రిస్తున్న విద్యార్థులపై పడ్డాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదితో తరగతి చదువుతున్న గుంజవరపు నిహారిక, కంగాల భావనకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వింజరం పిహెచ్‌సికి తరలించి చికిత్స అందించారు. పిహెచ్‌సి వైద్యాధికారి కె.మురళీధర్‌ మాట్లాడుతూ విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయని, ఎలాంటి ప్రమాదమూ లేదని, తలకు తగలడంతో ముందుజాగ్రత్తగా సిటీ స్కానింగ్‌ చేయించి పరీక్షలు నిర్వహించాలని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని తెలిపారు. ఇటీవల తహశీల్దార్‌ బి.సుమతి బోడిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో బస చేసి, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ తరుణంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల తహశీల్దార్‌ను వివరణ కోరగా విద్యార్థుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉంటున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.