ఆలస్యంగా వెలుగులోకి...
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని జాంగూడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పద్దు నయోమి అనే గిరివిద్యార్థిని స్వగ్రామమైన గసభలో శనివారం అకస్మాత్తుగా మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఆరోగ్యంగానే ఉంటూ వారి గ్రామానికి వెళ్ళిన తర్వాత గత శనివారం అస్మాత్తుగా మృతి చెందడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యంతో మృతి చెందిందా లేక ఇతర వేరే కారణాలతో చెందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా బయటకు తెలియడంతో స్థానిక గిరిజన సంఘాలు, మహిళ సంఘాలుతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్ధిని మృతికి కారణాలపై పాఠశాలలో సందర్శించి ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి
ఆదివాసి గిరిజన మహిళ సంఘం
డుంబ్రిగుడ: మండలంలోని జాంగుడ ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి నయోమి విద్యార్థిని మృతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రధానోపాధ్యా యురాలిని సస్పెండ్ చేయాలని ఆదివాసి గిరిజన మహిళ జిల్లా అధ్యక్షురాలు వి విజయ, ప్రధాన కార్యదర్శి హైమ డిమాండ్ చేశారు. బుధవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల వేధింపులు కారణంగా మృతతి చెందినట్లు తెలిసిందన్నారు. పాఠశాలలో ఆరోగ్యంగానే ఉంటూ గ్రామానికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రధానోపాధ్యాయురాలు, మేట్రిన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. దీనిపై ఉపాధ్యాయులను సంప్రదిస్తే పొంతనలేని సమాధానం ఇస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసి గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.










