Feb 18,2023 23:16

ఆందోళన చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-జి.మాడుగుల:మండలంలో బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కోర్ర కవిత (11) గత కొద్ది రోజులుగా బంధవీధి ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆమె ఇంటికి స్వయంగా వచ్చేసింది. ఈనెల 17 న మధ్యాహ్నం ఒంటిగంటకు కవిత తన స్వగ్రామం మైన అరగడపల్లిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో గిరిజన సంఘ నాయకులు సాగిన ధర్మన్న పడాల్‌, కూడా రాధాకృష్ణ విద్యార్థి స్వగ్రామమైన అరగడపల్లి గ్రామానికి చేరుకొని విద్యార్థి మృతికి గల కారణాలు తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ, బాలిక మృతికి అధికారులు, స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. కవితకు ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని తండ్రి పాఠశాలకు వెళ్లినప్పుడు తనతో కుమార్తెకు పంపించండి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తానని చెప్పినా పాఠశాల సిబ్బంది పంపించ లేదన్నారు. స్కూల్‌ యాజమాన్యం కూడా వైద్యం అందించ పోవడంతో ఈనెల 9న కవిత తన ఊరు వరకు నడుచుకుంటు వచ్చిందని, కనీసం అటెండర్‌ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించినట్లు వాపోయారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి, బాధ్యులైన స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలు అరికట్టేందుకు హెల్త్‌ అసిస్టెంట్‌ను నియమించాలన్నారు. హాస్టల్స్‌లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు ప్రజాసంఘాలు, మీడియాకు అనుమతి ఇవ్వాలన్నారు. ఆశ్రమాల్లో అనుమతి ఇవ్వకపోవడంతోనే ఏమి జరుగుతుందో బయట తెలియకపోవడంతో విద్యార్థుల మరణాలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కో కన్వీనర్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాగన ధర్మానపడాల్‌, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు పాంగి జీవన్‌ కృష్ణ, మహిళా సంఘం నాయకురాలు అరగడ శ్రీలత పాల్గొన్నారు.