
ప్రజాశక్తి - కశింకోట
వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు మేలు జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కశింకోటలో బుధవారం జరిగిన ఆసరా సభ కశింకోట మండలంలో 13 కోట్ల 31 లక్షల రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనానికి మేలు చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఓటు అడుగుతున్నారని, చంద్రబాబు నాయుడు తన పదవీకాలంలో ప్రజలకు ఏం మేలు చేశాడని ఓటు అడగడానికి వస్తున్నాడని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు పసుపు, కుంకుమ కింద డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఆ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు వినియోగించుకోలేని విధంగా ఆదేశాలు జారీ చేశారని ఎద్దేవా చేశారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే... ఉప్పు, కారంతో ఆయనకు మహిళలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. మండల సచివాలయ కన్వీనర్ కలగా గున్నయ్య నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి కలగా లక్ష్మి, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లి బాబు, వైస్ ఎంపిపిలు నమ్మి మీనా, పెంటకోట జ్యోతి, సర్పంచ్ మంత్రి జయరజని, వైసిపి నాయకులు మలసాల కిషోర్, గొల్లివిల్లి శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు, నమ్మి గణేష్ పాల్గొన్నారు.