
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ ఆసరా సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎపి ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ బాబు కోరారు. గురువారం కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలపై ఆరోగ్య మిత్రులు,టీం లీడర్లతో ఆరోగ్యశ్రీ జిల్లా కో- ఆర్డినేటర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో ఒపి నుంచి వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లి విశ్రాంతి సమయంలో కూడా వైఎస్‌ఆర్ ఆసరా ఆదుకుంటుందని తెలిపారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆరోగ్య మిత్రులు అండగా ఉండి వారికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందెలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 3,255 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రులు బాస్ అని చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ఎం ప్యానెల్మెంట్ కూడా రద్దు చేస్తామని పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసులో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఉచిత వైద్యం అందించాలన్నారు. వైద్యం కోసం వెళుతున్న ప్రజలకు వైద్య సేవల గురించి ఆరోగ్య మిత్రులకు తెలియజేయాలని చెప్పారు. ఆరోగ్య మిత్రులు కొన్ని సమస్యలు ఆయన దష్టికి తీసుకురాగా సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులకు వైద్యం చేయించుకుంటే సిఎం రిలీఫ్ ఫండ్ రాదని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆరోగ్య మిత్రులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించే దిశగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 53 వేల పైచిలుకు పోస్టులను వైద్య శాఖలో భర్తీ చేశారని పేర్కొన్నారు.18 వేల కోట్లతో కేన్సర్‌లోని అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చే విధంగా సిఎం చర్యలు చేపట్టారని చెప్పారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేలా పనిచేయాలని కోరారు. సమావేశంలో వైద్య అధికారులు పాల్గొన్నారు.