Apr 02,2023 00:33

ఆసరా చెక్కును అందిస్తున్న ముత్తంశెట్టి

ప్రజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం : ఆనందపురం మండలం సొంట్యాం గ్రామంలో 3వ విడత ఆసరా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసరా ద్వారా మండలంలో 1291 సంఘాల్లోని 13701 మంది సభ్యులకు రూ.10,45,03,489 చెక్కును అందించారు. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు మహిళాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంతపు నిత్యవసర వస్తువుల స్టాళ్లను ముత్తంశెట్టి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌, జడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యనారాయణ, నాయకులు గన్‌రెడ్డి శ్రీను, బిఆర్‌బి.నాయుడు బొట్ట ధనలక్ష్మి, రామకృష్ణ, పాండ్రంకి శ్రీను, కోరాడ ముసలి నాయుడు, బంటు చిన్న, పినిశెట్టి సింహాచలం నాయుడు, లంక రాంబాబు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: జివిఎంసి 98వ వార్డు సచివాలయ పరిధిలో గల డ్వాక్రా మహిళలకు సింహాచలం వరాహ పుష్కరిణిలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. అనంతరం స్థానిక వైసిపి నాయకులు ఎర్రవరం బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి ఆయనతో తినిపించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ మల్లునాయుడు, వైసిపి నాయకులు లంక సత్తిబాబు, ఎన్‌.అప్పారావు, బి.శ్రీనివాసరావు, సాడి మధు, సిరిపురం కృష్ణ, దోమరోతు రాము తదితరులు పాల్గొన్నారు.