ప్రజాశక్తి రొద్దం : వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద తమకు విడుదలైన నిధులు మంజూరులో వెలుగు అధికారులు చేస్తున్న జాప్యంపై మండలంలోని చోలేమర్రి గ్రామంలోని మారుతీ మహిళాసంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద సిసితో వాగ్వాదానికి దిగారు. ఆసరా కింద తమ సంఘానికి మంజూరైన నిధులను సిసి అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. ఈ విషయంపై కారణాలు అడిగితే సంఘంపై 39 వేల రూపాయలు అప్పు ఉందని వాటిని చెల్లిస్తే సంతకాలు చేపడతామని సిసి సమాధానమిచ్చారు. అయితే తమ సంఘం ఎలాంటి అప్పుల లేదని మహిళలు చెప్పారు. గతంలో ఉన్న సీసీలు మారుతీసంఘానికి అప్పు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపారని సిసి సమాధానమిచ్చారు. దీనిపై మహిళాసంఘ సభ్యులు వివరాలు ఆరా తీయగా 2010గ్రామైక్యసంఘానికి రూ.2.60 లక్షలు అప్పు ఇచ్చినట్లు గ్రామైక్యసంఘం లీడర్ సమాధానమిచ్చారు. అయితే ఆ నిధులను మారుతీ సంఘానికి ఇవ్వలేదని నిర్ధారించారు. దీంతో సిసి వాస్తవాన్ని గ్రహించారు. అయితే సంఘంలోని ప్రతిసభ్యురాలు ఎన్‌ఆర్‌ఎల్‌ఎంకు సంవత్సరానికి రూ.500 ప్రకారం రెండు సంవత్సరాలకు సంబందించి వెయ్యిరూపాయలు కట్టాలని చెప్పాడు. ఆడబ్బులు చెల్లిస్తే ఆసరా నిధులు సంఘానికి మంజూరు చేయడానికి సంతకం పెడతానని చెప్పారు.










