ప్రజాశక్తి - ఆరిలోవ : దీనదయాల్‌పురంలోని ప్రభుత్వ బాలుర గృహానికి ఆసరా స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలబడింది. సుమారు రూ.50 వేలు విలువ చేసే జ్యూట్ బ్యాగ్‌లు తయారుచేసే రెండు కుట్టు మిషన్లను సోమవారం ప్రభుత్వ బాలుర గృహం పర్యవేక్షణాధికారి వీరయ్యకు అందించింది. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, సభ్యులు రామారావు, డి.సూర్యనారాయణ, రాఘవరావు మాట్లాడుతూ, ఆసరా సంస్థ ఏర్పడి 11 ఏళ్ళు గడిచిందన్నారు. ముందు ముగ్గురుగా ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం 300 మంది సభ్యులుగా ఏర్పడి పేద విద్యార్థులకు, వైద్యం చేయించుకోలేని పేద రోగులకు సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు ఆసరాగా నిలుస్తుందన్నారు. పిఎం.పాలెంలో సంస్థ ఆధ్వర్యాన వృద్ధాశ్రమం నడుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బాలుర గృహం పర్యవేక్షణాధికారి వీరయ్య మాట్లాడుతూ, ఆసరా సంస్థ ద్వారా తమ విద్యార్థులకు అనేక సహాయ సహకారాలు అందాయని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు జనశిక్షణా సంస్థ ద్వారా జ్యూట్ బ్యాగ్‌ల తయారీపై శిక్షణ తీసుకున్నారన్నారు. బాలురు తయారు చేసిన బ్యాగ్‌లను మార్కెటింగ్ చేసి వాటిపై వచ్చిన ఆదాయాన్ని బాలుర అకౌంట్‌లో జమ చేస్తామని తెలిపారు.










