'ఆసరా' కొందరికే..
- 70 శాతం మందికే నగదు జమ
- 45 రోజులైనా పడని డబ్బులు..
- వైఎస్‌ఆర్ ఆసరా లబ్ధిదారుల ఆందోళన
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం జమ చేసే సొమ్ములు లబ్ధిదారులకు ఎప్పటికి జమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సిఎం బటన్ నొక్కి నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకూ సగం మంది లబ్ధిదారులకు కూడా ఖాతాలకు సొమ్ము చేరలేదు. 45 రోజుల క్రితం బటన్ నొక్కి విడుదల చేసిన డ్వాక్రా సంఘాల ఆసరా సొమ్ము ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. దీంతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది...
2019 ఏప్రిల్ 11వ తేదీ వరకూ ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు వైసిపి హామీ ఇచ్చింది. డ్వాక్రా సంఘాలకు చేసే ఈ ఆర్థికసాయానికి 'ఆసరా' పథకంగా ప్రభుత్వం నామకరణం చేసింది. రెండు విడతల సొమ్ము జమ చేయగా మూడో విడత సొమ్ము మార్చి 25న ఏలూరు జిల్లా దెందులూరులో సిఎం బటన్ నొక్కి విడుదల చేశారు. నంద్యాల జిల్లాలో 25,936 స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైఎస్‌ఆర్ ఆసరా నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మూడో విడతగా రూ.166.96 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3044 స్వయం సహాయక పొదుపు సంఘాలకు రూ. 20.89 కోట్లు, బనగానపల్లిలో 4282 సంఘాలకు రూ.28.29 కోట్లు, డోన్‌లో 3029 సంఘాలకు రూ.17.81 కోట్లు, నందికొట్కూర్‌లో 4072 సంఘాలకు రూ.27.29 కోట్లు, నంద్యాలలో 2001 సంఘాలకు రూ.13.95 కోట్లు, పాణ్యంలో 1346 సంఘాలకు రూ. 63.94 కోట్లు, శ్రీశైలంలో 3277 సంఘాలకు రూ.21.45 కోట్లు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సిఎం బటన్ నొక్కిన తర్వాత ఎంఎల్‌ఎలు అంతా వారివారి నియోజకవర్గాల్లో మెగా చెక్కుల పంపిణీ చేసి హడవుడి చేశారు. ఆసరా సొమ్ము విడుదలకు సంబంధించి సిఎం బటన్ నొక్కి 45 రోజులు గడిచింది. ఇప్పటి వరకూ 70 శాతం గ్రూపులకు మాత్రమే ఆసరా సొమ్ము జమ అయింది. మిగిలిన గ్రూపులకు ఎప్పటికి జమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. డ్వాక్రా సంఘాల్లో 70 శాతం పైగా గ్రూపులకు నగదు జమైనట్లు తెలుస్తోంది. ఆసరా డబ్బు జమ కాకపోవడం డ్వాక్రా సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా డబ్బులు జమ కావడానికి 15 రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతుండటంతో ఇదేం తీరంటూ డ్వాక్రా సంఘాల మహిళలు ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసా, అమ్మఒడి పరిస్థితి ఏంటి..?
ఖరీఫ్ ఆరంభంలో రైతు భరోసా, స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి అమ్మఒడి పథకాలకు సంబంధించిన సొమ్ము విడుదల చేయాల్సి ఉంది. బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన సొమ్ములే ఇంకా జమ కాలేదు. బటన్ నొక్కాల్సిన పథకాల సొమ్ము ఇక ఎప్పటికి జమవుతుందోనన్న చర్చ లబ్ధిదారుల్లో కొనసాగుతోంది.
asara logo










