Jan 17,2021 17:38

భూమి దుఃఖిస్తోంది
రోడ్డుపై నిలబడ్డ
రైతును జూస్తూ
అక్కరకురాని చట్టాలను చూస్తూ
ఆకాశం సిగ్గుతో తలదించుకొంది

ఆకలిని అధిగమించి
ఓపికను నీడను చేసి
న్యాయం అంటూ
నిలబడ్డ అడుగులకు
ఓదార్పు పలుకులు ఊరిస్తూ
ఊరవతలే ఉన్నాయి

ఆశగా ఎదురుచూస్తున్న రైతు కళ్ళు
వాయిదాల పర్వాన్ని చూస్తూ
నిప్పు పిడికిళ్లై నినదిస్తున్నాయి
ఎంతకూ దిగిరాని
ధీరులను చూస్తూ
దేశం తీక్షణంగా గమనిస్తోంది

అందరి రాతలు విధాత రాస్తే
రైతు రాతను ఎవరో రాయడం విడ్డూరం
రాజు అన్నవాడి నడ్డి విరచడం హేయం
అతడు కన్న కలల్ని కూల్చడం నీచాతి నీచం
ఆసరా అడుగులు
మడుగులై ముంచడం
రైతుకు తీరని శాపం...!!

మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415