Sep 01,2023 00:25

వైద్యులతో మాట్లాడుతున్న్ల కలెక్టర్‌ రవి సుభాష్‌

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ పఠాన్‌ శెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, జనరల్‌ వార్డులను పరిశీలించారు. ఎక్స్‌ రే రూము సందర్శించి, రోజుకు ఎన్ని ఎక్స్‌ రేలు తీస్తారని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌ను పరిశీలించి, ఎన్ని రకాల టెస్ట్‌లు చేస్తారో ఆరా తీసారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి రోగుల వివరాలను ఎలా నమోదు చేస్తారో అనే సమాచారాన్ని సిబ్బందిని అడిగి క్షుణంగా పరిశీలించారు. రోజుకు ఎంత మందిని రోగులను ఇక్కడి నుంచి పంపిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.వైద్యుల గదులు పరిశీలించి సేవలపై ఆరా తీశారు.రోజుకు ఎంతమందిని ఓపి చూస్తారో అడిగి తెలుసుకున్నారు.ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ప్రమాదంలో గాయపడి క్షతగాత్రులు మొదటిగా వచ్చేది నక్కపల్లి ఆసుపత్రికేనని, తప్పనిసరిగా ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. బెర్త్‌లు చాలక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, బెర్త్‌ లు ఇప్పించాలని, అదనంగా శానిటేషన్‌ సిబ్బందిని నియమించాలని కోరారు.ఆసుపత్రి ఆవరణంలో హెటిరో ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న వాటర్‌ ప్లాంట్‌ ను పరిశీలించారు. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడంతో పాటు, స్కానింగ్‌ యంత్రాన్ని కూడా హెటిరో యాజమాన్యం సమకూర్చిందని కలెక్టర్‌ దృష్టికి సూపరింటెండెంట్‌ తీసుకువెళ్లారు. దీంతో కంపెనీ ప్రతినిధులు సుబ్బారెడ్డి ,సుధాకర్‌ లను కలెక్టర్‌ అభినందించారు.మండల పరిషత్‌ నిధుల నుండి అత్యవసరంగా బోరు వేసి నీటి సమస్యను పరిష్కరించారని సూపరింటెండెంట్‌ చెప్పడంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ,అధికారులను కలెక్టర్‌ అభినందించారు.బాత్‌ రూమ్‌ లలో రోగులు వాడే నీరు నిల్వ ఉండిపోతుందని, బయటకు వెళ్లడం లేదని దీంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రోగులు కలెక్టర్‌ దష్టికి తీసుకువెళ్లారు .మండలంలోని కాగిత పంచాయితీ కి ఏకగ్రీవ నిధులు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను సర్పంచ్‌ రాజేష్‌ కోరారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల నిర్మాణానికి సంబంధించి స్థల కేటాయింపుకు ఆమోదం చేయాలని వైస్‌ ఎంపీపీ నానాజీ కోరారు. రెండుసార్లు వేలిముద్రం వేయించుకొని సరుకులు ఇవ్వడం ఇబ్బందిగా ఉందని సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ కు ఇంటింటికి రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్న వాహనదారులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈపిఓపి ర్‌ డి.వెంకటనారాయణ, ఏవో సీతారామరాజు, ఎంఈఓ నరేష్‌, వైస్‌ ఎంపీపీ నానాజీ, వైసిపి మండల శాఖ అధ్యక్షులు శీరం నరసింహమూర్తి, నాయకులు సురకాసుల గోవింద్‌, ఫార్మసిస్ట్‌ హిమామ్‌, రామచంద్ర పాల్గొన్నారు.
ఓటర్‌ జాబితా వెరిఫికేషన్‌
నక్కపల్లి:మండలంలోని దేవవరంలో గురువారం జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ ఓటర్‌ జాబితా వెరిఫికేషన్‌ ను పరిశీలించారు. ఇటీవలా గ్రామంలో బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటా ఓటరు సర్వే చేపట్టి, మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టారు. ఇవన్నీ పక్కగా ఉన్నాయా లేదా అని కలెక్టర్‌ పరిశీలించారు. డెత్‌లకు సంబంధించిన పేర్లను తొలగించడంతో, ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ధారించుకున్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న కాలనీకి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ భర్త గొర్ల నరసింహమూర్తి కలెక్టర్‌ను కోరారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో సీతారామరాజు ,బూత్‌ లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.