ప్రజాశక్తి - ఆస్పరి
అర్ధాంతరంగా నిలిచిపోయిన వేదవతి ప్రాజెక్టును 8 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించి ఆస్పరి మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి సాగు, తాగునీరు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ అధ్వర్యంలో మండలంలోని బిల్లేకల్ గ్రామం నుంచి ఆస్పరి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గమని తెలిపారు. తాగునీటికి తుంగభద్ర దిగువ కాలువపై ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లయిందని తెలిపారు. ఎలాంటి నీటి సౌకర్యమూ లేక నిత్యం కరువు బారినపడుతూ, పంటలు పండక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేదవతి ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విరుపాక్షి, మద్దిలేటి శెట్టి, రాజా సాహెబ్, జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య పాల్గొన్నారు.










