Oct 05,2023 00:42

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన మిర్చి పైరు ఇచ్చే దిగుబడులపై రైతుల్లో ఆశనిరాశలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అవుతుందని అంచనా ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లోనే సాగుచేశారు. సాగర్‌ జలాశయంలో నీరు లేకపోవడం వల్ల పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈఏడాది మిర్చిసాగు కూడా ఇంతవరకు ఊపందుకోలేదు. మిర్చికి తప్పని సరిగా రెండు మూడు తడులకు నీటి అవసరం ఉంది. సాగర్‌ నుంచి నీరురాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. దీంతో రైతులు మిర్చి సాగుకు ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయారు. సెప్టెంబరులో భారీ వర్షాలు కురవడం వల్ల రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపారు. అయితే ఆదిలోనే పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర తెగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు.
ప్రత్తిపాడు, మేడికొండూరు, సత్తెనపల్లి, నర్సరావుపేట, రొంపిచర్ల, చిలకలూరిపేట, యడ్లపాడు తదితర ప్రాంతాల్లో ఆదిలో భారీ వర్షాలు కురవడం వల్ల మిర్చి సాగు చేసిన ప్రాంతాల్లో పైరు ఎదుగుదల దశలో ఉంది. కొన్నిచోట్ల పూత దశలో ఉంది. సెప్టెంబరులో కురిసిన వర్షాలకు కొంత ప్రాంతాలో అప్పటికే ఎదుగుదల దశలో ఉన్న పైరుకు మేలు చేయగా ఇప్పటి వరకు పంటలు వేయని వారికి కూడా ఈ వర్షాలు బాగా ఉపయోగపడ్డాయి. అయితే నవంబరు తరువాత మిర్చి కాయలు ఏర్పడే నాటికి నెలకు ఒక తడి చొప్పున డిసెంబరు, జనవరినెలల్లో నీటి అవసరం ఉంటుంది. అప్పటికీ జలాశయాలు నిండుతాయన్న ఆశతో రైతులు ఆశతో మిర్చి సాగు చేశారు. కానీ ప్రస్తుతం వర్షాలపైనే ఆధారపడి సాగవుతోంది. అక్టోబరు చివర నుంచి నవంబరు చివర వరకు తుపాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి పెద్దగా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు నుంచి మార్చి వరకు మిర్చికి నీటి అవసరం ఉంది.
పెట్టుబడి ఎక్కువ అయినా మార్కెట్‌లో మిర్చి ధర క్వింటాళ్‌ కనిష్టంగా రూ.15 వేలు, గరిష్టంగా రూ.20 వేలకు తగ్గకుండా లభిస్తుందన్న ఆశతో ఆలస్యంగానైనా సాగుకు మొగ్గుచూపారు. ప్రస్తుతం ఆల్మటి, నారాయణపూర్‌, జూరాల నుంచి శ్రీశైలానికి ఆశించిన స్థాయిలో నీటిప్రవాహం రావడం లేదు. ఎగువ నుంచి గరిష్టంగా 7 వేల క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రం 94.91 టీఎంసీల నిల్వ ఉంది. గతేడాది ఇదేరోజుకు 215.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌ జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసిలు సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 158.74 టీఎంసీలు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజుకు 311.15 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌ జలాశయంలో గరిష్టంగా 250 టీఎంసీల నీటి నిల్వ దాటి ఉంటేనే కాల్వలకు కొంత మేరకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని లేదంటే 200 టిఎంసిల కన్నా తక్కువ ఉంటే మాత్రం పైర్లకు నీటి విడుదల ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి ఎగువన ఉన్న జలాశయాలు నిండితేనే సాగర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.