ఉద్యోగమొచ్చినా నిరుద్యోగులుగా మిగిలిపోయాం!
డిఇఒ కార్యాలయం వద్ద డిఎస్‌సి98 అభ్యర్థుల ఆందోళన
ప్రజాశక్తి - ఆరిలోవ : డిఎస్‌సి 1998లో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి అర్హత సాధించినా 60 ఏళ్ళు పైబడ్డ వారికి ఉద్యోగం కల్పించక పోవడంతో తిరిగి తామంతా నిరుద్యోగులుగా మిగిలిపోయామని డిఎస్‌సి-98 అభ్యర్ధులు వాపోతున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం జిల్లా విద్యాశాఖాధికారిణి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. డిఇఒకు వినతిపత్రం అందించారు.
డిఎస్‌సి 1998లో అర్హులైన అభ్యర్థులకు ఇటీవల ఎంటిఎస్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2023 మార్చి 15 నాటికి 60ఏళ్లులోపున్న వారికే ఉద్యోగాలిచ్చారు. దీంతో 60ఏళ్ల నిబంధనలతో డిఎస్‌సిలో అర్హులైనప్పటికీ, జిల్లా సుమారు 40 మంది మళ్లీ నిరుద్యోగలుగా మిగిలి పోయారు.
ఈ సందర్భంగా వారు మట్లాడుతూ మానవతా దృక్పథంతో అవకాశం కల్పిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, 60ఏళ్లు వయస్సు నిబంధన పెట్టడంతో తామంతా ఉద్యోగార్హత కోల్పోయి, నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62ఏళ్లుగా పెంచిన ప్రభుత్వం, డిఎస్‌సి 98 అభ్యర్థులకు మాత్రం 60ఏళ్ల నిబంధన పెట్టడం దుర్మార్గమన్నారు. అప్పట్లో తమకు అన్యాయం జరగకపోతే, ప్రస్తుతం 62ఏళ్ల వరకు ఉద్యోగంలోనే ఉండేవారమన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో తమను భర్తీ చేయాలని కోరారు.










