Feb 06,2022 12:41

కొత్తగా రాయడానికి ఏముంది
పాతగా మిగిలిపోయిన పగుళ్లు తాలూక జ్ఞాపకాలు తప్ప
కొత్తగా ప్రశ్నించడానికి ఏం మిగిలుందని
గత కాలపు ప్రశ్నల ఫైళ్ల మీద బరువుగా మిగిలిన బూజు తప్ప
అలవాటుపడ్డ కాలం మీద అలసిపోయిన జీవితాలు
ఏ నదుల తాలుకో దుఃఖాన్ని నింపుకొని నిద్రిస్తున్నాయి
బహిర్గతం కాని భావాల మధ్య
భయాల తాలూక భద్రత మీదుగా
అణగిమణగి ఎవరి గుప్పిట గూట్లోనో
నోరు నొక్కేయబడి కిచు కిచుమంటూ
ఏ అధికారం తాలూకు అడుగుల కిందో
అణిచివేయబడి ఆవురావురుమంటూ
ఇంకెన్నాళ్లు ఈ అపరిపక్వత అనాలోచిత అంగీకార బానిసత్వం
ఆధునిక అభివృద్ధి జాబితాల తారతమ్యం
ఏడు తరాల నీ ఇంటి తలుపుల మీద అతికించబడి ఉంది
వెళ్లి తనివి తీరా చూసుకో
కుట్రపూరిత రాజ్య నిర్మాణ వ్యవస్థలో
రక్తసిక్తమై నలుగుతున్న జాతి పాదముద్రల తాలూక
పచ్చి వాసన ఇంకా వీస్తూనే ఉంది
ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పట్టుబడని నల్లడబ్బంతా
నీ చెమట చుక్కలు కక్కిన రూపాయి రూపం
ఇదో ప్రజాస్వామ్యం అంటూనే
పగ్గాలన్నీ పిడికిలిలో పట్టుకొని
దేశాన్ని నిలబెట్టిన నీ మీదే నిందలేస్తుంటే
నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి యుద్ధం ప్రకటించకుండా
నిల్చుని చూస్తూ ఉంటే
నిమిషానికో సిద్ధాంతం శిలాశాసనంలా
అర క్షణానికో అధికారం అరాచకంగా
రాద్ధాంతం చేస్తూనే ఉంటాయి
ఈ కార్పొరేట్‌ రాక్షస వ్యవస్థలో
నిన్ను నువ్వు కొనుక్కోవాల్సిన ఓ రోజు వస్తుంది
అప్పుడు నేను ఒక అసంతృప్తి కావ్యం
వీలునామాగా రాసి నీ తాలూకా సంతాపం ప్రకటిస్తాను.
 

పి.సుష్మ
99597 05519