నిర్మాణ పనుల్లో నిండా నిర్లక్ష్యం
పూర్తిచేసేందుకు కానరాని చర్యలు
ప్రజాశక్తి- కొత్తకోట : గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతోపాటు, గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణ పనులు అంసపూర్తిగానే నిలిచిపోయాయి. మూడేళ్ల కిందట స్వచ్ఛభారత్ సాకారం లక్ష్యంతో ఉపాధి నిధులతో వీటి నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఇవి లేకపోవడం వంటి కారణాలతో వీటిని పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అసంపూర్తిగానే నిలిచిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 645 పంచాయతీలు ఉండగా, 480 పంచాయతీలకు చెత్త సంపద కేంద్రాలను మంజూరు చేశారు. మరో 44 నూతన పంచాయతీలకు కూడా చెత్త సంపద కేంద్రాలు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది అయితే 200 చెత్త సంపద కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, మిగతా కేంద్రాల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉండిపోయాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో సంపద కేంద్రానికి రూ. నాలుగు లక్షల నుంచి 10 లక్షల వరకూ జాతీయ ఉపాధి హామీ పధకం నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. అట్టహాసంగా ప్రారంభించిన ఈ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయి పోవడంతో ప్రజాధనం వృథా అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రావికమతం మండలంలో 20 సంపద కేంద్రాలు మంజూరు చేయగా, నేటికీ ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి కాలేదు. గ్రామాల్లో ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడంతోపాటు సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రైతులకు తక్కువ ధరలకు విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలకు అందజేయడం ద్వారా బహళ ప్రయోజనాల లక్ష్యంతో వీటిని చేపట్టారు. ప్రస్తుతం జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకంలో ప్రచారం చేస్తున్నారే తప్ప, వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయక పనులు పూర్తిచేసే చర్యల్లోనూ నిండా నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తోంది.
.










