ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలో నాడు, నేడు రెండో విడత కింద ఎంపికైన పాఠశాలలకు నిధులు రానందున నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని పాఠశాలల విద్యా కమిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నాడు నేడు రెండో విడత కింద ఎంపికైన పాఠశాలలు 26 ఉన్నాయి. అందులో హైస్కూల్స్-3, అంగన్‌వాడీ బిల్డింగులు-3, యూపీ పాఠశాల-1, ప్రాథమిక పాఠశాలలు-19 ఉన్నాయి. ఈ ఎంపికైన పాఠశాలలకు 15 శాతం నిధులను విడుదల చేశారు. ఈ నిధులను పాఠశాలల నిర్వహణ కమిటీల ద్వారా, వివిధ స్థాయిలలో పాఠశాలల నూతన తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణం, వంట గదులు, ప్రహరీ గోడల నిర్మాణాలు, పాఠశాల మరమ్మతులను చేశారు. మిగిలిన పనులను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ఇంకా మంజూరు కాలేదని పేర్కొన్నారు. దీంతో భవన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిఉన్నాయి.
నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల పాఠశాలలోని విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోందని విద్యా కమిటీలు తెలుపుతున్నాయి. ఒక్కొక్క పాఠశాలకు పది పనుల కోసం రూ.10 లక్షలు, భవన నిర్మాణాల కోసం రూ.11 లక్షలు అవసరం కాగా, ప్రభుత్వం మొదటి విడతగా 15 శాతం నిధులే విడుదల చేయడంతో పాఠశాల నిర్వహణ కమిటీ వారు ఆ నిధులతోనే అయినకాడికి పనులు కానిచ్చేశారు. మిగిలిన నిధులు విడుదల చేస్తే అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేసి, రాబోయే విద్యా సంవత్సరం కల్లా నిర్మాణాలు పూర్తి చేస్తామని వారు చెబుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదలుపెట్టిన భవన నిర్మాణాలు నాలుగు నెలల్లో అంటే జనవరి కల్లా పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆరు నెలలు దాటినా, నిధుల జాప్యంతో ఆగిపోయాయని చెబుతున్నారు. జూన్ నెల నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని, విద్యార్థులకు అసౌకర్యం కలవకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను మంజూరు చేయాలని ఆయా పాఠశాలల విద్యా కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.










