
వర్షం వస్తే రోడ్లు జలమయం
ఇబ్బందుల్లో ప్రజలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
ప్రజాశక్తి - పాలకొల్లు
పట్టణంలోని మురుగు పోయేందుకు ప్రధాన డ్రెయిన్ అయిన దమయపత్రి డ్రెయిన్ గత దశాబ్దంన్నర క్రితం పనులు ప్రారంభమైనా నేటికీ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో చినుకులు పడితే రోడ్లు చెరువులుగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2010లో బంగారు ఉషారాణి ఎంఎల్‌ఎగా ఉండగా రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బ్రాడీపేట శివారు నుంచి దొడ్డిపట్ల రోడ్డు మీదుగా వరిధనం వద్ద మొగల్తూరు డ్రెయిన్‌లో కలుస్తుంది. అయితే దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఈ డ్రెయిన్ ఆక్రమణలతో ఉండటంతో దీని నిర్మాణం నత్తనడకగా సాగింది. గతంలో నరసాపురానికి చెందిన కాంట్రాక్టర్ డ్రెయిన్ బాగున్న చోట నిర్మాణం ప్రారంభించారు. అయితే మురుగుమయంగా ఉన్న చోట నిర్మాణం అలానే ఉండిపోయింది. కాంగ్రెస్ హయాంలో దీని నిర్మాణం పూర్తి కాలేదు. ఎస్టిమేషన్ ధరలు పెరగడం, ఇసుక ధర దారుణంగా పెరిగిన నేపథ్యంలో ఈ డ్రెయిన్ నిర్మాణం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో పట్టణంలో మురుగు వెళ్లే మార్గం లేక చినుకులు పడితే రోడ్లు, డ్రెయిన్లు ఏకమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా కౌన్సిల్ లేకపోవడంతో దీని గురించి అడిగేవారే లేకపోయారు. వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జిగా కవురు శ్రీనివాస్ కూడా దీని నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎన్నికల సమయానికి ముందు కూడా దీనిని పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా స్పందించి డ్రెయిన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.