ప్రజాశక్తి -మధురవాడ : స్థానిక పిహెచ్‌సి పరిధిలో అసంక్రమిత వ్యాధులపై ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇందులో భాగంగానే ఏడో వార్డు వాంబే కాలనీలో పిహెచ్‌సి వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి, ఆయా ఇళ్లలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, హార్మోన్ సమస్యలు, రక్తహీనత, కేన్సర్, మానసిక వ్యాధులు, కిడ్నీ, గుండె, దంతాలు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి, ఎన్‌సిడిసిడి యాప్‌లో నమోదు చేసి ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు నెంబరు(ఐడి) ఇస్తారన్నారు. దీనికి గాను ఆధార్‌తో మొబైల్ నెంబరును అనుసంధానించాల్సి ఉంటుందన్నారు. లేకుంటే సంబంధిత వ్యక్తులు ఒటిపి చెప్పాలన్నారు. సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని డాక్టర్ ప్రశాంతి కోరారు.
ఈ సర్వే ఆధారంగా నమోదు చేసిన వివరాల ఆధారంగా మున్ముందు అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎక్కడికి వెళ్లినా, ఈ ఐడి నెంబరు నమోదు చేయగానే రోగికి సంబంధించిన పూర్వ అనారోగ్య సమస్యలు, వాడిన మందులు,ఏయే ఆసుపత్రుల్లో చికిత్స పొందారో పూర్తి సమాచారం తెలుస్తుందని, తద్వారా వైద్యం చేయడానికి సులభమౌతుందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది లక్ష్మీ పాల్గొన్నారు.










