Oct 05,2023 21:28

కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి -విజయనగరం :  జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్‌ గుర్తింపు కార్డులను పొందాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. ఎన్నో ప్రయోజనాలు కల్గించే ఈ గుర్తింపు కార్డులను సచివాలయాలు లేదా కామన్‌ సర్వీసు సెంటర్‌ నుంచి ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా యూనివర్సిల్‌ అకౌంట్‌ నంబర్‌ (యుఏఎన్‌) కేటాయించి గుర్తింపు కార్డులను జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 4,15,142మందికి ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేశామని, ఇంకా సుమారు 2,50,188 మందికి జారీ చేయాల్సి ఉందని తెలిపారు. వీరంతా తక్షణమే తమ పేర్లను ఈ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రోజువారీ కూలీలు, కళాసీలు, హమాలీలు, రిక్షా కార్మికులు, మోటారు కార్మికులు, భవన నిర్మాణం, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసేవారు, రైతు కూలీలు, చిన్న సన్నకార రైతులు, కౌలు రైతులు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు, చిన్న వ్యాపారస్తులు, జాతీయ ఉపాధిహామీ కూలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తూ గౌరవ భృతి పొందేవారు, దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సదుపాయం లేనివారు, కాంట్రాక్టు కార్మికులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారంతా ఈ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకొని, గుర్తింపు కార్డులను పొందవచ్చునని తెలిపారు.
ఈ గుర్తింపు కార్డు కలిగిఉండి, ప్రమాద వశాత్తూ మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, వారికి కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ విధంగా 2022 మార్చి 31లోగా మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన వారి ధరఖాస్తులను, డిఆర్‌డిఎ పీడీ, ఉప కార్మిక కమిషనర్‌, డిఎంఅండ్‌హెచ్‌ఒ, జిల్లా ఎస్‌పిలతో కూడిన కమిటీ పరిశీలించి, వాటిని అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అసంఘటిత కార్మికులు రేషన్‌ కార్డు లేకపోయినట్లయితే, వెంటనే రేషన్‌ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. దీనిప్రకారం జిల్లా పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ శ్రమ్‌ గుర్తింపు కార్డులు కలిగిఉన్నవారు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ ధన్‌ పథకం (పిఎంఎస్‌వైఎం) ద్వారా పించన్‌ సదుపాయాన్ని కూడా పొందవచ్చునని సూచించారు. బహుళ ప్రయోజనాలను కల్గించే ఈ గుర్తింపు కార్డులను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాడానికి ఆధార్‌ నంబర్‌, ఆధార్‌ లింక్‌ అయిన సెల్‌ నంబరు, బ్యాంకు అకౌంట్‌ వివరాలను సచివాలయంలో సమర్పించి పొందవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు కార్మిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ కోరారు.