ప్రజాశక్తి - ఏలూరు
ప్రస్తుతం విద్యాశాఖలో చేపడుతున్న పనిసర్దుబాటు సహేతుకంగా లేదని, అసంబద్ధంగా, అభ్యంతరకరంగా ఉందని ఫ్యాప్టో ఛైర్మన్ పిబివిఎన్‌ఎల్.నారాయణ, జనరల్ సెక్రటరీ జి.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆదివారం జరిగిన ఫ్యాప్టో సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం పని సర్దుబాటులో భాగంగా విడుదల చేసిన జాబితాలో టీచర్ల పని సర్దుబాటు విధానం మానసికంగా కుంగదీసే విధంగా ఉందన్నారు. వారికి కౌన్సెలింగ్ జరిపి సీనియర్లకు, జూనియర్లకు అంతరం తగ్గిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగా అన్ని సబ్జెక్టుల్లో కేడర్ సీనియారిటీ జాబితా తయారు చేయాలని, తదుపరి వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. పాఠశాలలను సందర్శించే అధికారులు విద్యావ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉండాలి తప్ప, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ చేస్తూ చర్యలు తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి లోతుపాతులు సరిచేసుకునే అవకాశం ఆయా టీచర్లకు, హెడ్‌మాస్టర్లకు ఇవ్వాలన్నారు. క్రమశిక్షణా చర్యల పేరుతో మానసికంగా కుంగదీయడం ఫ్యాప్టో పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. వెంటనే పని విభజనపై కో ఆర్డినేషన్ మీటింగ్ జరిపి అందరికీ ఆమోదయోగ్యంగా కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం నాయకులు ఎం.ఆదినారాయణ, సయ్యద్ జిలానీ, పివి.నరసింహారావు, రంగావలి, రామారావు, రవికుమార్, సాయిరాజు, భల్లం పాల్గొన్నారు.










