
దేశవ్యాప్తంగా అమృతోత్సవాలను అట్టహాసంగా జరపాలని ఊదరకొడుతున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం ఎక్కడున్నాం? మన ఉనికి ఏమిటి? రాజ్యాంగం చెప్పిన సమానత్వంలో మన ఆచరణ ఎలా ఉందని ప్రశ్నించుకుంటే.. ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పొచ్చు. దేశంలో కుల, మత, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోలేదు. అంటరానితనం సమసిపోలేదు. ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. వారి కోసం కేటాయించిన రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదు. ఎన్నేళ్లయినా విద్య, ఉపాధిలోనూ.. ఏ రంగంలోనూ వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. సామాజికంగా వారిని హీనంగానే చూస్తున్నారు. అందరికన్నా మరింత అణచివేతకు, శ్రమదోపిడీకి గురవుతున్నారు. సమాజంలో అందరూ సమానమేనని రాజ్యాంగంలో రాసుకున్నది కాగితాలకే పరిమితమవుతున్నది. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ 'వలసకాలం నాటి భారతీయ న్యాయవ్యవస్థను సమూలంగా మార్చడం'పై మాట్లాడుతూ.. 'మన రాజ్యాంగం వలసకాలం నాటి న్యాయవ్యవస్థను కొనసాగిస్తోంది. ఇది భారతీయతకు తగినది కాదు. మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, నారదుడు, యజ్ఞవాల్క్యల న్యాయ సాంప్రదాయాలను పాటించడం ద్వారా న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాలని' ఆయన సూచించాడు. రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వున్న నజీర్ పలికిన ఈ పలుకులు... బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అజెండా తప్ప మరొకటి కాదు. దళితులు, మహిళల అణచివేతను ప్రోత్సహించిన మనువాదాన్ని తిరిగి తీసుకురావాలని సాక్షాత్తూ ఒక న్యాయమూర్తే చెప్పడంకంటే దుర్మార్గం మరేమీ ఉండదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రెండు మూడు దశాబ్దాలలో ఏ కొద్దిపాటి పురోగమనం మనం సాధించామో... అదంతా వినాశనమైనదంటూ ఈ హిందూత్వ ద్వయం తెగ బాధపడుతోంది. మానవత్వమే లేని పాతకాలంనాటికి తిరిగి తీసుకెళ్లాలని చూసేవాళ్లు రకరకాల పాత్రలలో ఇప్పుడు తయారయ్యారు. ముందు ఈ ప్రమాదాన్ని వదిలించుకోవాలి. లేదంటే.. వచ్చేది అమృతఘడియలు కాదు.. రాహుకాలం.

'కర్మణ్యేవాధికారస్తీ, మాఫలేషుకదాచన' అన్న భగవద్గీత సూత్రం.. ఆయా కులాలకు సంక్రమించిన విధులను నిర్వర్తించమని బోధించేదే. అధికారాలను అనుభవించడమే బాధ్యతగా అగ్రకులాలు, నిరంతరం సేవకులుగా కింది కులాలు తమ విధులను నిర్వర్తించడమే ధర్మమని హిందూమతం ఘోషిస్తోంది. పుట్టుకతో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని మనువాద ధోరణులను ఈ వ్యవస్థ కొనసాగిస్తోంది. ఆ భావనే తరతరాల భారతీయ చైతన్యం అన్నట్లుగా విస్తరింపజేస్తున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ఈనాటికీ మన దేశాన్ని రాజ్యాంగానికి అనుగుణంగాకాక మనుధర్మానికి అనుగుణంగా నడుపుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కులం, మతంతో కలిసి ఊసరవెల్లిలా తన రూపాన్ని మార్చుకుంటూ కఠినతరమౌతోంది. నేటికీ వెలివాడల్లో వెలుగులు గుడ్డి దీప కాంతిలాగే మిణుకు మిణుకుమంటున్నాయి.
మతమార్పిడి పేరుతో ఆధిపత్యం..

మనదేశంలో కులం అనేది ఒక సజీవ వాస్తవం. చార్వాకుల కాలం నుండి ఈనాటి వరకూ.. అంటే గత రెండున్నర వేల సంవత్సరాలకు పైగా పీడిత కులాలు, నిమ్నవర్గాలు క్రూరమైన, నేరపూరితమైన కులవ్యవస్థకు బలవుతూనే ఉన్నాయి. 16, 17 శతాబ్దాల కాలంలో క్రైస్తవ మత ప్రచారం, ఆంగ్లేయుల రాక... ఈ రెండూ చరిత్రలో లిఖించదగ్గవి. ఈ సమయంలో క్రైస్తవ మత ప్రచారంతో పాటు క్రైస్తవ మత మార్పిడి ఊపందుకుంది. ఆనాడు పంచముల్లో ప్రబలిన అసంతృప్తిని క్రైస్తవ మిషనరీలు ఆసరా చేసుకున్నాయి. వారి ఉద్ధరణకు బాటలు వేశాయి. అదే సమ యంలో ఈ కుల పిశాచి క్రైస్తవ మతంలోకి సైతం వ్యాపించింది. అంటరానివారంటూ హిందూమతంలో దేవుడికి, దేవాలయాలకు దూరంగా నెట్టేయబడిన వారు.. ఇక్కడా వివక్షను ఎదుర్కోక తప్పడం లేదు. అగ్రకుల ఆధిపత్యం కింద మగ్గిపోక తప్పడంలేదు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే పేరుతో అగ్రకుల పెత్తందారీతనం ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది.
చులకన భావం..

ఒకప్పుడు హైన్యాన్ని, దైన్యాన్ని, దారిద్య్రాన్ని సూచించేదిగా ఉన్న ''దళిత'' పదం.. ప్రస్తుతం కొన్ని కులాల పేర్లను సూచించే పదంగా మారింది. ''దళిత'' అన్న పదం బలహీనతను, అసహాయతను, వైఫల్యాన్ని సూచించదు. అదొక సంఘటిత శక్తికి ప్రతీక. ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ఆలంబన. తరతరాలుగా అస్పృశ్యతకు గురై, మతం పేరుతో సాంస్కృతికంగా హీనంగా చూడబడుతూ, విద్యా, వైద్య సౌకర్యాలు కరువై, సమాజంలో ప్రధాన జీవనస్రవంతికి దూరంగా కడగట్టువారిగా ఉంటూ.. అణచివేతకు, శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్వాతంత్య్రానంతరం కూడా దళితుల జీవితాల్లో మార్పు రాలేదు. స్వాతంత్య్రం వస్తే సమాన హక్కులు, అవకాశాలు, గుర్తింపు లభిస్తుందని కలలుగన్నారు. ఆ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. దారిద్య్రం, ఆకలి, నిరుద్యోగం, అస్పృశ్యత, కుల, వర్గ, రాజకీయ, సాంఘిక రుగ్మతలు అంతకు ముందుకంటే ఎక్కువయ్యాయి. పాలకులు మారినా, చట్టబద్ధమైన ప్రభుత్వాలు వచ్చినా.. అంటరానితనం నిర్మూలన ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.
వివక్ష రూపాలు..

కులం విచ్చుకత్తుల బోను దళితుల్ని క్షణక్షణం ఊచకోతలకు గురి చేస్తూనే ఉంది. అంటరానితనం రకరకాల రూపాల్లో విశృంఖలంగా అమలవుతూనే ఉంది. 'పుట్టుకే ప్రశ్నార్థకమైన కర్మభూమిలో/ కాలం శిలువకు వేలాడుతున్న జీవన్మృతుడిని/ స్పృశ్యాస్పృశ్యాల సంధ్యలో/ చిరునామా కోల్పోయిన దిష్టిబొమ్మలా/ నీచవర్ణపు బిళ్లను మెడకు తగిలించుకొని/ భూత భవిష్యత్తుల మధ్య/ మనుగడ కోసం జీవితాన్ని తాకట్టుపెట్టిన బాధితుడ్ని...' అని ఓ కవి చెప్పినట్టుగా ఈ దేశంలో దళితుల పుట్టుకే ప్రశ్నార్థకమౌతోంది. ప్రతి క్షణం, ప్రతి మలుపులో, ప్రతి గాయంలో కులం నత్త నెత్తిమీద గూడులా వెన్నాడుతోంది. పుట్టుక మనిషి విలువలను నిర్ణయించే అర్హతగా కొనసాగుతూనే ఉంది. జీవితంలోని అన్ని రంగాల్లోకి కులం వ్యాపించి, జీవితాన్ని శాసిస్తూనే ఉంది. 'మాలపల్లి' నవలలో.. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి చేను గట్టు మీద నడిచిందని ఆమెను బసివిరెడ్డి చావచితక కొడతాడు. వైద్యం చేయించినా సుబ్బలక్ష్మి బతకదు. ఆమె చనిపోతూ, 'అమ్మా! దేవుడి దగ్గరకు వెళుతున్నానమ్మా..!' అని జ్యోతితో చెబుతూ, 'దేవుడి దగ్గరకు నన్ను రానిస్తారా?' అని అడుగుతుంది. ఈ నవల వచ్చి శతవసంతాలైంది. ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' నవలలో చిత్రించిన పరిస్థితులు నేటికీ దళితుల జీవితాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే అంటాడు జాషువా 'కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్/ కనపడుట లేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్' అని.
వెంటాడుతున్న వెనుకబాటుతనం..

అనేక ఏళ్లుగా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అన్నివిధాలుగా వెనుకబడిపోతూనే ఉన్నారు. అణచివేతకు, వివక్షకు గురవుతూనే ఉన్నారు. దళితులు ఏ మతం స్వీకరించినా వారి స్థితిగతులు మారలేదు. సామాజిక స్థాయిలో ఏమాత్రం మార్పు రాలేదు. సామాజిక మార్పును ఆశించి మతం మార్చుకున్నా.. కులం ఏమాత్రం మారదనేది జగమెరిగిన సత్యం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి, 75 ఏళ్లు గడిచినా దళితక్రైస్తవుల పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. సామాజికంగా మరింత వెనుకబాటుతనాన్నే అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రైస్తవుల పట్ల అణచివేత, వివక్ష కొనసాగుతోంది. క్రైస్తవుల స్థితిగతులను మార్చేందుకు నాటి నుంచి నేటివరకూ పాలకులు ఏమాత్రం శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు.
మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచి క్రైస్తవమత సంఘాలు, సంస్థలు కుల, మత, పేద, ధనిక తేడా లేకుండా అనేక రకాలుగా వైద్య, విద్య, సామాజిక రంగాల్లో సేవలందిస్తున్నాయి. కేవలం క్రైస్తవ మతం స్వీకరించిన కారణంగా హక్కులను కోల్పోవడం జరుగుతుందంటే మన రాజ్యాంగానికే మాయని మచ్చ. దళితులు ఏ మార్పును ఆశించి క్రైస్తవాన్ని స్వీకరించారో.. ఆ మార్పు క్రైస్తవం స్వీకరించిన తర్వాత కూడా రాలేదని 1955 - 2007 వరకూ నియమిం చబడిన అనేక కమిషన్స్ ధృవీకరించాయి. క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన కులం మారదు. వారి దారిద్య్రమూ తగ్గదు. అందుకే, దళితుల స్థితిగతులు మార్పు చెందేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని హక్కులు, భద్రత కల్పించబడినా వాటిని అమలు చేయడంలో పాలకులు దృష్టి సారించలేదు. ఈ స్థితి దళిత క్రైస్తవులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. మతపరమైన వివక్ష, దాడులు, అణచివేత కొనసాగినా పట్టించుకోకపోగా వాటిని సమర్థించేలా వ్యవహరించడం క్రైస్తవ మతం స్వీకరించిన దళితులపై పాలకులు సైతం వివక్ష చూపుతున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో క్రైస్తవులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ప్రభుత్వాలు దళితులు, దళిత క్రైస్తవుల పట్ల నిర్లక్ష్యం వీడాలి. అన్ని రకాలుగా భరోసానివ్వాలి. 1956లోనూ దేశంలో సిక్కు మతం స్వీకరించిన దళితుల కోసం, బౌద్ధం, క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన దళితుల కోసం 1990లోనూ ప్రెసిడెన్సియల్ (ఎస్సీ) ఆర్డర్ 1950 సవరించబడింది. ఈ ఆర్డర్‌ను అనుసరించి హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు స్వీకరించిన దళితులకున్న హక్కులు, భద్రతను దళిత క్రిస్టియన్లకు, దళిత ముస్లింలకూ వర్తించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన దళితులను ఎస్సీలుగానే గుర్తించి, అన్ని రకాలుగా ఆదుకోవాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం 1950 నాటి ప్రెసిడెన్సియల్ (ఎస్సీ) ఆర్డర్‌ను సవరించాలి. దళితులకు, దళిత క్రిస్టియన్లకు తగు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలు దీనిపై తీర్మానం చేసి, కేంద్రానికి పంపాయి. ఆ తీర్మానాలను బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. రాష్ట్రప్రభుత్వాలు కూడా తీర్మానం చేయడం వరకే తమ బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయే తప్ప, కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది లేదు.
లైంగిక దాడులు..

తరతరాల నుంచీ వస్తున్న పితృస్వామ్య వ్యవస్థ భావజాలం, పెత్తందారీతనం ఈ దేశంలో ఇంకా ఉంది కాబట్టే.. ప్రతీ నేరంలోనూ కుల కోణం కచ్చితంగా ఉంటోంది. అసలు కులవ్యవస్థ పునాదులే హింసపై నిర్మించబడ్డాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కులం పునాదులపై నిర్మితమైన హిందూమతాన్ని రాజకీయం చేస్తూ.. కుల విభజనకు ఆజ్యం పోస్తోంది. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత దళిత స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింస, ఆర్థిక దోపిడీ మరింత పెరిగాయి. 'మహిళలు ఏ మేరకు పురోగతి సాధించారనేది కొలమానంగా నేనా జాతి ప్రగతిని అంచనా వేస్తా' అంటారు డా|| అంబేద్కర్. కానీ, దళిత మహిళల్లో పురోగతి అనేది నేటికీ అందని ద్రాక్షగానే ఉంది. నిరక్ష్యరాస్యత, పోషకాహార లోపం, రక్తహీనత వారిని వెన్నాడుతున్నాయి. మరోవైపు లైంగిక దాడులు.. వివక్ష, అత్యాచారాలు, కులదురహంకార హత్యలు అత్యధిక భాగం దళితులపైనే జరుగుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అది రక్షణ ఇవ్వలేకపోతోంది.
దళిత సాహిత్యం..

సమాజంలోనూ, సాహిత్యంలోనూ దళిత స్పృహ ఒక బలమైన చైతన్యంగా నిలబడడం వెనుక కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. దళితుల జీవితానుభవం నుంచి పొందిన స్పందన, నిరసన, ఉద్ధరణ, విమర్శ, విజ్ఞాపన, సంఘటన, ప్రతిఘటన మొదలైన దశలు దళిత సాహిత్యంలో కనిపిస్తాయి. ఒకానొక దశలో దళితులు రాసిన సాహిత్యాన్నీ దళిత సాహిత్యమంటూ అంటరానిదిగా చూశారు. దానికి మహాకవి జాషువాయే అతిపెద్ద నిదర్శనం. జాషువా 'గబ్బిలం' రాసేంతవరకూ దళిత స్పృహ సాహిత్యంలో వ్యక్తం కాలేదు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అణచివేతలకు, అస్పృశ్యతకు వ్యతిరేకంగానే దళిత సాహిత్యం పురివిప్పింది. దళిత అస్తిత్వ అన్వేషణ, సామాజిక న్యాయం, సమానత్వ భావన, మానవ విలువల పరిరక్షణ, సుఖమయ జీవనం గడపాలనే ఆకాంక్ష, ఆత్మగౌరవం కావాలనే కోరిక, దోపిడీ, అణచివేతలపై నిరసన, అసమాన సాంఘిక జీవనంపై వ్యతిరేకత, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోని గుత్తాధిపత్యంపై తిరుగుబాటు, దళితుల ఐక్యత సాధించడం వంటి అంశాలు బలమైన లక్ష్యాలుగా, ఉద్యమానికి ప్రతీకలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ లక్ష్య సాధనే సమాజంలోని అన్ని కోణాల్లోంచి, అన్ని సాహితీ ప్రక్రియలను తమ లక్ష్యానికి ఆయుధాలుగా ఎంచుకున్నారు దళిత కవులు, రచయితలు.
కుల, మతాల ప్రాబల్యం..

దేశంలో కులవ్యవస్థ మానవ జీవితాలతో మానవీయ విలువలతో ఆడుకుంటూ వాళ్ల వాళ్ల మత ప్రాబల్యాల చుట్టూ శాస్త్రాల పేర్లతో నియమాల్ని, వ్యత్యాసాల్ని ఏర్పాటు చేసింది. సమాజం నరనరాల్లో మనుధర్మశాస్త్ర సారాల్ని, కులసిద్ధాంతాన్ని నింపింది. మనదేశంలో హిందూమతం అతి పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను అస్పృశ్యులుగా, నీచులుగా, చండాలురుగా ప్రకటించి, వారిని అజ్ఞానులుగా, పేదవారిగా, ఐకమత్యం లేనివారిగా, వెనుకబడేలా చేయడానికి మతాన్ని ఆసరాగా చేసుకుంది. ప్రాచీన కాలం నుంచి ఈ అస్పృశ్యతా వర్గాన్ని చారిత్రక దశల్లో ఆయా కాలాల్లో 'దస్యులు, చండాలురు, అనార్యులు, దాసులు, అస్పృశ్యులు, మ్లేచ్ఛులు, పంచములు, అంటరానివారు, హరిజనులు, షెడ్యూల్డు కులాలు, దళితులు' అని పిలిచారు. ఇలా సమాజ అవసరతను, అవకాశాన్ని బట్టి ఏ ఏ కాలాల్లో ఎలా పిలిచినా వారి జీవన నేపథ్యం, బతుకు చిత్రం ఒక్కటే. దళితులది వెలివాడల జీవితం. భద్రతలేని చీకటి జీవితం, భరోసా లేని అర్ధాకలి బతుకులు. నాటి నిచ్చెనమెట్ల వ్యవస్థలో అడుగడుగునా అంతరాలు సృష్టిస్తూ.. సామాజిక జన జీవన సౌందర్యం నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు. హిందూమతం అతి పవిత్రమైనదిగా చలామణి అవుతున్న రోజుల్లో ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థ మానవ మనసునే కుంచింపజేసి, మానవుని శక్తి సామర్థ్యాలను తొక్కిపెట్టి, వారి ప్రగతిని వక్రీకరించింది. మొత్తం దేశ జనాభాలో ఒక విస్తారమైన భాగాన్ని అంటరానివారుగా సమాజానికి ఆవలకు నెట్టేసింది. ఎన్ని పోరాటాలు జరుగుతున్నా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నేటికీ అగవ్రర్ణాల, పెట్టుబడిదారుల, భూస్వాముల చేతుల్లో దోపిడీకి, పీడనకూ, అణచివేతకూ వీరు గురవుతూనే ఉన్నారు. వీరిని చరిత్రలో అస్పృశ్యులుగా, అంటరాని కులాలుగా ముద్ర వేశారు. భౌతిక హింస కంటే ఎక్కువగా మానసిక హింసకు పాల్పడుతున్నారు.
కులదురహంకార హత్యలు..

'పరువు' పేరుతో జరిగేవన్నీ కులదురహంకార హత్యలే. కులానికి స్త్రీ ముఖద్వారం లాంటిదని మనువాదం చెబుతోంది. మహిళల శారీరక, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట, లైంగిక పవిత్రత అంటూ.. ఈ హత్యలకు తెగబడుతున్నారు. భూస్వామ్య వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన పితృస్వామిక భావజాలం.. స్త్రీని వస్తువుగానే చూస్తున్నాయి. ఏ కులంలో పుట్టామో.. ఆ కులంలోనే కొనసాగాలన్న ఆధిపత్య ధోరణి ఈ కుల దురహంకార హత్యలకు కారణం. ముఖ్యంగా దళితుల పట్ల ఈ వివక్ష తీవ్రంగా కొనసాగుతోంది. కులం దాటితే కుమార్తెనైనా, అల్లుడినైనా లేదా ఇద్దరినీ చంపేయడానికి వెనుకాడటంలేదు.
'కులం ఓ పెద్ద లూసీఫరై/ ఊరి చివర వదిలి వెళ్లిపోయింది' అంటాడో కవి. ప్రతి క్షణం, ప్రతి మలుపులో, ప్రతి గాయంలో కులం నత్త నెత్తి మీద గూడులా వెన్నంటే ఉంటోంది. అది బడిలోనా, గుడిలోనా అన్న తేడా లేకుండా అడుగడుగునా వెంటాడుతోన్న కులం గాయాలను మాన్పుకోడానికి ఆదరువవుతుందనుకున్న క్రైస్తవం కూడా ఎండమావిగానే మారింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా కులాధిపత్యం వేయి తలల కాలనాగులా కాటు వేస్తూనే ఉంది. అడుగడుగునా కులం చేస్తున్న గాయాల తాలూకు సలపరింపు నుంచి బతుకే ఒక పోరాటంలా సాగుతున్న వెలివాడల చీకటి బతుకుల్లో వెలుగులు నిండాలంటే.. ఈ రాహువును వదిలించుకోవాలి. ఈ వివక్షను ఎదిరించడానికి అంబేద్కర్ లాంటివారు చేసిన పోరాటానికి మించిన పోరాటం చేస్తే తప్ప మన దేశ లౌకికతత్వాన్ని కాపాడుకోలేం. అలాగే ఈ పోరాటంలో కలిసొచ్చే శక్తులను కలుపుకొనిపోవాలి. అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను కలుపుకోవాలి. వివక్షకు, అణచివేతకు కేవలం కులం ఒక్కటే కారణం కాదు. ప్రాంతం, మతంతో పాటు పేదరికం, అసమానతలు పెరుగుతున్నాయి. వివక్షకు గురవుతున్నవారంతా ఏకమై ఈ అసమానతలపై పోరాటాన్ని సాగించాలి. అప్పుడే అమృతఘడియలు.. అమృతోత్సవాలు..
రాజాబాబు కంచర్ల
94900 99231