Sep 12,2023 23:25

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - తాడేపల్లి : బిజెపి పాలనలో దేశం అధోగతిపాలైందని, ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగం, అసమానతలు పెంచి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి సిపిఎం రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు. నల్లడబ్బు వెలికితీస్తానని పెద్ద నోట్లు రద్దు చేసి వందలాది మంది మరణానికి కారణమయ్యారని, పెద్ద కుబేరులు తమ దగ్గర ఉన్న నల్లడబ్బును తెలుపుగా మార్చుకోవడానికి నోట్ల రద్దు ఉపయోగపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి జమిలి ఎన్నికలు అక్కర్లేదని, ఈ విధానం అమలు చేయడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం వద్ద విస్తృత అధికారులు తన గుప్పెట్లో పెట్టుకుని నియంతృత్వ పాలన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై గొడవ చేస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సనాతన ధర్మం అంటే ప్రజలకు చెప్పి మద్దతు కోరాలని సవాలు విసిరారు. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరిడిల్లుతుందని అన్నారు. ప్రజలందరికీ సమభావం కోసం పని చేయాలని బిజెపికి సూచించారు. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న బిజెపి ఎంత తొందరగా గద్దె దిగితే అంత మంచిదన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ జాతీయ ఉన్మాదాన్ని బిజెపి రెచ్చగొడుతోందని, చంద్రయాన్‌కు కూడా బిజెపి మతం రంగు పులుముతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పూల్వామా ఘటనను ఉపయోగించుకుని 43 మంది సైనికులు మృతికి మోడీ కారణమయ్యారని, సైనికుల ప్రాణాలు పణంగా పెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదిర్శ పాశం రామారావు మాట్లాడుతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్నారు. బిజెపిని సామాన్య ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న సంగతిని ఈ మూడు పార్టీలు గుర్తించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కమ్యూనిస్టుల పోరాటాల వల్లే వచ్చాయని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్లు వేయించిన ఘనత సిపిఎంకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 14 వేల మంది ఇళ్లస్థలాలు, ఇళ్లపట్టాలు లేని వారు ఉన్నారని, వారందరికీ స్థలాలు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడ నివశిస్తున్న పేదలకు అక్కడే పట్టాలు ఇవ్వాలని, వివాదంలో ఉన్న రాజధాని స్థలాల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఇ.అప్పారావు, ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, జెవి రాఘవులు, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు డి.శ్రీనివాసకుమారి పాల్గొన్నారు.