Oct 31,2023 23:27
వెలిగండ్లలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం కార్యకర్తలు

ప్రజాశక్తి-వెలిగండ్ల: దేశాన్ని, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ఈ ఉద్యమంలో సిపిఎం ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. వెలిగండ్ల మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం ప్రజా రక్షణ భేరి పేరుతో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు రాయల మాలకొండయ్య మాట్లాడుతూ బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందని, దేశంలో బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మైనార్టీలకు, స్త్రీలకు కోట్లాది మంది కార్మికులకు న్యాయం జరగలేదని, విద్య, వైద్యం ప్రైవేటీకరించటం వలన సామాన్యులకు అవి భారంగా మారాయని, ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ ప్రజల ఆస్తుల్ని అంబానీ ఆదానీలకు దోచిపెడుతోందని అన్నారు. అర్ధాకలితో బతుకుతున్న వారు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ మంది మన భారతదేశంలో ఉన్నారంటే అది మోడీ పాలన పుణ్యమే అని వారు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్‌ విషయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, జిపిఎస్‌ పేరుతో మోసం చేసిందని, అంగన్‌వాడీలకు, ఆశాలకు, మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల ఆయాలు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు చేసిన వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే సిపిఎం ప్రజా రక్షణ భేరి మోగిస్తుందని, అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి మహాప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కొత్తపట్నం: ప్రజా రక్షణ భేరిలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జివి కొండారెడ్డి కోరారు. సిపిఎం కొత్తపట్నం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో విజయవాడ ప్రజా సమస్యలు పరిష్కారానికై నవంబర్‌ 15వ తేదీన ప్రతి కార్యకర్త ప్రజానీకాన్ని సమీకరించి చలో విజయవాడను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలతో మండల వ్యాప్తంగా ప్రచారం చేయాలని, విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని అన్నారు. అలాగే నవంబర్‌ 7వ తేదీన ఒంగోలులో జరిగే బస్సు యాత్ర సభను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సోమిరెడ్డి, మండల నాయకులు సునీల్‌, పుచ్చలపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.