Nov 08,2023 00:38
సత్తెనపల్లి సభలో మాట్లాడుతున్న ఎంఎ గఫూర్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి/పల్నాడు జిల్లా/సత్తెనపల్లి : దేశంలో అసమానతలు లేని అభివృద్ధి జరగాలని, సంపద అందిరికీ సమానంగా దక్కాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ అన్నారు. సిపిఎం నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరీ బస్సుయాత్ర మంగళవారం పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా కేంద్రమైన నరసరావుపేట, సత్తెనపల్లిలో బృందం పర్యటించింది. యాత్రకు నరసరావుపేటలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి సత్తెనపల్లికి చేరుకున్న యాత్రకు వర్షంలో కూడా ప్రజలు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలకడంతోపాటు సభ జరుగుతున్నంత సేపు వర్షం కురుస్తున్నా ప్రసంగాలను విన్నారు. సత్తెనపల్లిలో జరిగిన సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ కుమార్‌ అధ్యక్షత వహించారు. నర్సరావుపేటలో జరిగిన సభకు సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అధ్యక్షత వహించారు. గఫూర్‌ మాట్లాడుతూ సంక్షేమ రాజ్యం అంటున్న జగన్‌ కరువు నివారణకు తగిన పరిష్కారం కనుగొనడంలో రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విపలమయ్యారన్నారు. కరువుపై కేంద్రంతో కనీసం సంప్రందించకపోవడం దారుణమన్నారు. ఎకరాకు రూ.40 నుంచి రూ.50 వేల వరకు రైతులు నష్టోపోయారని, గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టి మూడు విడతలుగా రూ.13,500 ఇస్తే భరోసా సరిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ఆరు నెలలు మందు ఇచ్చే హామీలను నమ్మొద్దని, 2018లో చంద్రబాబు కూడా గోదావరి, పెన్నా అనుసంధానం పేరుతో శంకుస్థాపన చేసి హడావుడి చేశారు తప్ప ఫలితం లేదని గుర్తు చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత పనులు చేపట్టి నాలుగేళ్లలో పూర్తి చేసి మళ్లీ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంకు అనుకూలంగా కృష్ణా జలాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ట్రిబ్యునల్‌ తీర్పును పున: సమీక్షకు అంగీకరిస్తే రాష్ట్రం ఎడారిగా మారుతుందన్నారు. తుంగభధ్రపై మరో ప్రాజెక్టుకు కర్నాటకకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని గఫూర్‌ ఖండించారు. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ సూత్రదారిగా ఉన్నారని దుయ్యబట్టారు. అయినా రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన మాట్లాడటం లేదన్నారు. ప్రజల తరుఫున అన్ని పార్టీలను కేంద్రం వద్దకు తీసకువెళ్లి పోరడాల్సిన సిఎం జగన్‌ ఒక లేఖ రాసి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. విభజన హామీలను కేంద్రం విస్మరించినా సిఎం జగన్‌ మాట్లాడరని, పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కూడా మోడీ పంచన చేరుతున్నారని ఎద్దేవ చేశారు. ప్రజా ఉద్యమాలపై టిడిపి హయాంలో చరద్రబాబు ఎలా నిర్బంధం అమలు చేశారో ఇప్పుడు అలాగే కొనసాగుతుందన్నారు. చంద్రబాబుకు జైలుకు వెళితే కాని నిర్బంధం ఎలా ఉంటుందో బోధపడలేదన్నారు. వైసిపి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఎన్నికల్లో అన్ని పార్టీలు చాక్లెట్‌ ఇచ్చి చెవికమ్మలు లాక్కునే వారేనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సింహం, పులులు అని పిలిపించుకుంటారని కానీ మోడీ వద్దకు వెళ్లగానే వీరు పిల్లులుగా మారిపోతరాని అన్నారు. రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ కర్నూలు నుండి చేపట్టిన ప్రజారక్షణ బేరి యాత్ర ఈ నెల 15న విజయవాడ చేరుకుంటుందని విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు వి.కృష్ణయ్య, కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సోషలిజం ద్వారానే పేదలకు మేలు జరుగుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికి సమానంగా దక్కాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి రైతు, కూలీలు, కార్మికులు, కష్ట జీవులు సంపద మొత్తాన్ని అంబానీలకు దోచిపెడుతోందని, ఒకప్పుడు రూ.పదివేల కోట్లున్న అదాని, అంబానీల ఆస్తులు నేడు రూ.లక్షల కోట్లకు చేరుకుందని అన్నారు. ఆ సంపద మొత్తం దేశంలోని కోట్లాది మంది పేద ప్రజల వద్ద నుండి దోచిపెట్టిన సంపదేనని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1200 అయ్యిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా రూ.200 తగ్గించిందని అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుంటే మనదేశంలో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. సిపిఎం నాయకులు వి.శివనాగరాణి మాట్లాడుతూ వర్షాభావం వల్ల పల్నాడు జిల్లాలో వరి పైరు వేయలేదని, వేసిన పత్తి, మిర్చి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. వేసిన పంట ఇంటికి రాకపోగా పెట్టిన పెట్టుబడులు, కౌలు కట్టలేక రైతులు అప్పుల పాలవుతుంటే, కనీసం ఆరుతడులకైనా నీరు ఇచ్చి ఆదుకోవాల్సిన మంత్రి అంబటి రాంబాబు ఏమి పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఒకవైపు దళితులపై దాడులు చేస్తున్న వైసిపి నాయకులపై ఏ విధమైన చర్యలు తీసుకోలేని ప్రభుత్వం సామాజిక బస్సు యాత్రలు పెట్టి దళితులను ఏమీ ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కాజేసిన వైసిపి ప్రభుత్వం సామాజిక బస్సు యాత్ర ఎలా చేస్తుందని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా ఆ పార్టీతో అంటకాగుతున్న వైసిపికిని నమ్మడం ఎలాగని ప్రశ్నించారు. సత్తెనపల్లి పట్టణంలో ధోబి ఘాట్‌లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, స్థలాలు వంటివి ఏమీ ఇవ్వకపోడతో ఆ కాలనీలో రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాల్లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా స్లీపర్స కాలనీలో 40 సంవత్సరాలు నివాసముంటున్న వారికి ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. వర్షాలు లేక వ్యవసాయ పనులు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టణాలలో కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో కరువు తీవ్రంగా ఉన్నా ఒక మండలాన్ని కూడా ఎంపిక చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి పల్నాడు జిల్లాపై వివక్షేందుకని ప్రశ్నించారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వ్యవసాయ కార్మికులు పనులకు వచ్చేవారని, ఇప్పుడు ఇక్కడివారే వలసెళ్తున్నారని తెలిపారు. వారానికి రెండు మూడు రోజులు కూడా పనులు దొరక్క వేలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయన్నారు. బహిరంగ సభకు ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సాంస్కృతిక నత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రభాకరరెడ్డి, దయా రమాదేవి, భాస్కరయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఎ.లకీëశ్వరరెడ్డి, ఎస్‌.ఆంజనేయనాయక్‌, జి.రవిబాబు, సత్తెనపల్లి పట్టణ, మండల కార్యదర్శులు డి.విమల, పి.మహేష్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.